ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 20:36:16

ఎమ్మెల్యే హత్యకేసు : చార్జిషీటులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి పేరు..

ఎమ్మెల్యే హత్యకేసు : చార్జిషీటులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి పేరు..

కోల్‌కతా : కృష్ణగంజ్‌ నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌‌ రాయ్‌ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.  బిస్వాస్ హత్యలో రాయ్ ప్రధానంగా కుట్రదారుడిగా దర్యాప్తులో తేలడంతో శనివారం నోయిడా జిల్లా కోర్టుకు సమర్పించిన అనుబంధ చార్జిషీటులో సీఐడీ అధికారులు ముకుల్‌ రాయ్‌ పేరును చేర్చారు.

గత మేలో కోర్టుకు సమర్పించిన చార్జీషీటులో ఆయన పేరు చేర్చలేదు. ఈ సందర్భంగా ముకుల్‌‌ రాయ్‌ స్పందిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. తానెప్పుడూ హింసాత్మక రాజకీయాలకు పాల్పడలేదని అన్నారు. తనపై ఇంకా 45 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తాను హింసాత్మక రాజకీయాలను నమ్మేవాడిని కాదని అలాంటి చర్యలకు పాల్పడనని పేర్కొన్నారు. ఆరోపణలను ప్రజల్లో రుజువు చేయాలని సీఎం మమతా బెనర్జీని సవాల్‌ చేశారు. గతంలో మమతతో విబేధించి పార్టీలో నుంచి బయటకు వచ్చిన కారణంగానే తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.  గత సెప్టెంబర్‌లో ఇదే కేసులో బీజేపీ ఎంపీ జగన్నాథ్‌ సర్కార్‌ పేరును సీఐడీ అనుబంధ చార్జిషీటులో చేర్చింది.  గతేడాది పిబ్రవరిలో నదియా జిల్లాలో సరస్వతి పూజలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే  సత్యజిత్ బిశ్వాస్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.