బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 12:18:50

చనిపోయాడనుకున్న బాలుడు తిరిగొచ్చాడు.. మరి ఆ అస్థిపంజరం ఎవరిది?

చనిపోయాడనుకున్న బాలుడు తిరిగొచ్చాడు.. మరి ఆ అస్థిపంజరం ఎవరిది?

భోపాల్‌ : ఓ బాలుడు మూడేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. ఐదారు రోజుల పాటు బాలుడి కోసం వెతికారు. ఆచూకీ లేదు. కొద్ది రోజులకు ఊరి సమీపంలో ఉన్న అడవిలో ఓ అస్థిపంజరం కనిపించింది. అక్కడున్న గుడ్డ ముక్క తమ కుమారుడిదేనని భావించారు. దాంతో ఆ అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించారు. అస్థికలను నదిలో కూడా కలిపారు. కానీ నాడు చనిపోయాడని భావించి బాలుడికి అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు ఇప్పుడు షాక్‌కు గురయ్యారు. తమ కుమారుడు ఇంటికి తిరిగొచ్చేసరికి వారికి మాటలు రావడం లేదు. ఆ బాలుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు తల్లిదండ్రులు. 

మధ్యప్రదేశ్‌ బుందేల్‌ఖాండ్‌లోని చత్తార్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ బాలుడు తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటి నుంచి తప్పిపోయాడు. తండ్రితో గొడవ పెట్టుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుమారుడు ఇంటికి తిరిగి రాకపోయేసరికి.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం వెతికారు. కానీ లాభం లేదు. చివరకు ఆ ఊరికి సమీపంలోని అడవిలో ఓ బాలుడి అస్థిపంజరం బయటపడింది. అక్కడున్న గుడ్డ ముక్క తమ కుమారుడు ధరించిన చొక్కా మాదిరిగానే ఉందని భావించిన తల్లిదండ్రులు.. తమ బిడ్డే అయి ఉండొచ్చని అనుకున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. 

సీన్‌ కట్‌ చేస్తే.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తమ సొంతూర్లకు వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో 12 ఏళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు.. ఢిల్లీ నుంచి 600 కిలోమీటర్ల నడిచి.. సొంతూరుకు సోమవారం ఉదయం చేరుకున్నాడు. ఆ అబ్బాయి తన ఇంటికెళ్లి తలుపు కొట్టగా.. అతన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా షాక్‌కు గురై.. ఉద్వేగానికి లోనయ్యాడు. కుమారుడిని చూసిన తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. బాలుడి రాకతో ఆ గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. 

మరి ఆ అస్థిపంజరం ఎవరిది?

నాడు తప్పిపోయిన బాలుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో.. ఆ అస్థిపంజరం ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. మూడేళ్ల క్రితం కేసును మళ్లీ దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. logo