దమోహ్: వానలు కురిపించేలా వరుణ దేవుడిని మెప్పించేందుకంటూ మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో కొందరు బాలికలను నగ్నంగా నడిపించారు. వారితో భుజాలపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్పలను కట్టి ఊరేగించారు. వారి వెనుక గ్రామానికి చెందిన మహిళలు నడుస్తూ వరుణ దేవుడి పాటలు పాడుతూ నడిచారు.
దమోహ్ జిల్లాలోని బనియా అనే గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీని వెనుక ఆ బాలికల తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉన్నదని భావిస్తున్నారు. బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో వర్షాలు లేక కరువు ముసురుకుంటున్న వేళ గ్రామస్తులు మూఢనమ్మకాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. ఐదేండ్లలోపు బాలికలు ఆరుగురు ఒకరి పక్కన ఒకరు దుస్తులు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి బయటకువచ్చింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది.