రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు రైతుల కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వాళ్లు సేకరిస్తున్నారు. పారామిలిటరీ దళాలను హైఅలెర్ట్లో ఉండాలని ఆదేశించారు. ఎర్రకోట దగ్గర మరిన్ని బలగాలను మోహరించారు. మంగళవారం ఉదయం రైతులు తమకు కేటాయించిన రూట్లో కాకుండా మరో రూట్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి సెంట్రల్ ఢిల్లీలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత దేశ రాజధానిలో వేలాది మంది రైతులు హంగామా సృష్టించారు. ఏకంగా ఎర్రకోటపైకి దూసుకెళ్లి.. పంద్రాగస్ట్ నాడు ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే చోట తమ జెండాను ఎగరేశారు. ఎర్రకోటలోని మినార్పైకి ఎక్కి అక్కడా తమ జెండాను ఉంచారు. రైతులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగిన ర్యాలీలో.. ట్రాక్టర్ అదుపు తప్పి ఓ రైతు మృతి చెందాడు. అయితే ఈ హింసాత్మక ఘటనలకు తాము బాధ్యలము కాదని, ఎవరో సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించారని రైతులు చెప్పడం గమనార్హం.