మంత్రి సోదరుడిపై చీటింగ్ కేసు

లక్నో : మొబైల్ ఫోన్ బ్రాండ్‌ను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు వినియోగించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ మంత్రి సోదరుడిపై చీటింగ్ కేసు నమోదైంది. హజ్రత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 26న లలిత్ అగర్వాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. లలిత్ అగర్వాల్.. యూపీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ సోదరుడు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ తన సోదరుడిని టార్గెట్ చేశారని, అన్ని ఆరోపణల నుంచి బయటపడుతాడన్నారు. యాడ్ ఏజెన్సీని నడుపుతున్న లలిత్ అగర్వాల్, మొబైల్ ఫోన్ బ్రాండ్ లాంఛ్ చేయడానికి ముందు హోర్డింగ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను ప్రచురించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 26న హోర్డింగ్ నుంచి తొలగించారు. ఈ విషయంపై క్షమాపణ కూడా చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు జరపాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.