ఆదివారం 29 మార్చి 2020
National - Feb 13, 2020 , 16:44:52

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: కేటీఆర్‌

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: కేటీఆర్‌

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్ర బడ్జెట్‌పై చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్రం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్దమని తెలిపిన మంత్రి.. ఇలా వ్యాఖ్యానించడం సవ్యం కాదని తెలిపారు. న్కూఢిల్లీలో టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌ ఈ విధంగా స్పందించారు. కేంద్రం మరింత ఉదారపూర్వకంగా ఉండాలని మంత్రి అన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌తో చర్చించామని తెలిపిన మంత్రి.. కేంద్రంతో రాష్ర్టానికి ఉండే సంబంధాలను నెరుపుతూనే అంశాల వారీగా విభేదించామని తెలిపారు. సీఏఏ అంశంలోనూ రాష్ట్రం తరఫున విభేస్తున్నట్లు ప్రకటించామని మంత్రి గుర్తు చేశారు. ఒక రాజకీయ పార్టీగా, రాష్ట్ర ప్రభుత్వంగా సీఏఏను ఎందుకు విభేధించామో వివరంగా తెలిపామని కేటీఆర్‌ అన్నారు. జీఎస్టీ బకాయిలపై సైతం సీఎం కేసీఆర్‌ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారని కేటీర్‌ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని సీఎం డిమాండ్‌ చేశారని మంత్రి పేర్కొన్నారు. చట్టం ప్రకారం ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు మంత్రి అన్నారు. 

కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా, అసంబద్దంగా ఉందని మంత్రి తెలిపారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానాలు చూశామనీ.. తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారని కేటీఆర్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు కేటీర్‌ తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 2.70 లక్షల కోట్ల పన్ను ఆదాయంగా చెల్లించామనీ, కేంద్రం మాత్రం రాష్ర్టానికి తిరిగి రూ. లక్షా 15 వేల కోట్లేనని మంత్రి వివరణ ఇచ్చారు.

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆదాయానికి, రాష్ర్టానికి ఇచ్చిన ఆదాయానికి దాదాపు రూ. లక్షా 60వేల కోట్ల వ్యత్యాసం ఉందని మంత్రి తెలిపారు. ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ మనుగడ దెబ్బతినక తప్పదని మంత్రి సూచించారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో తప్ప ఇతర రాష్ర్టాలలో బీజేపీ చాలా బలహీనంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పే నిజమైన ఫెడరల్‌ స్ఫూర్తితో దేశం నడిచే రోజు త్వరలోనే వస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 


logo