ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 23, 2020 , 01:29:31

‘మైండ్‌ రీడింగ్‌' హెడ్‌సెట్‌!

‘మైండ్‌ రీడింగ్‌' హెడ్‌సెట్‌!

  • ఢిల్లీకి చెందిన అర్ణవ్‌ తయారీ
  • టైమ్‌ మ్యాగజైన్‌ ‘100 అద్భుత ఆవిష్కరణల’ జాబితాలో చోటు

న్యూఢిల్లీ, నవంబర్‌ 22: ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాదికిగానూ రూపొందించిన ‘100 అద్భుత ఆవిష్కరణల’ జాబితాలో ఢిల్లీకి చెందిన అర్ణవ్‌ కపూర్‌ చేసిన ఆవిష్కరణకు చోటుదక్కింది. అమెరికాలోని ‘మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఎంఐటీ)లో పోస్ట్‌ డాక్టొరల్‌ విద్యార్థి అయిన అర్ణవ్‌.. కృత్రిమమేధతో పనిచేసే ‘మైండ్‌ రీడింగ్‌' హెడ్‌సెట్‌ను తయారుచేశారు. ఈ హెడ్‌సెట్‌కు ‘ఆల్టర్‌ఎగో’ అని పేరుపెట్టారు. సంభాషణ రుగ్మతలతో (స్పీచ్‌ డిజార్డర్లతో) బాధపడుతున్న వారిలో భావ వ్యక్తీకరణ సమస్యను అధిగమించేందుకు ఈ హెడ్‌సెట్‌ దోహదపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే, కేవలం తమ మెదడులో ఆలోచనల ద్వారా వారు కంప్యూటర్‌తో అనుసంధానం అయ్యేందుకు ఈ హెడ్‌సెట్‌ ద్వారా వీలవుతుంది. ఉదాహరణకు, ఈ రోజు వర్షం వస్తుందో రాదో తెలుసుకోవాలనుకుంటే, మీరు చేయాల్సిందల్లా కేవలం మెదడులో ఆ ప్రశ్నను అనుకోవడమే. హెడ్‌సెట్‌ సెన్సర్లు ఆ సంకేతాలను రీడ్‌ చేస్తాయి. ఆ పరికరం వెబ్‌ కనెక్షన్‌ ద్వారా మీ ల్యాప్‌ట్యాప్‌లో టాస్క్‌ మొదలుపెడుతుంది. పరికరంలో ఉండే బోన్‌ కండక్షన్‌ స్పీకర్‌ ద్వారా ఆ ఫలితాలను మీరు వినగలుగుతారు.