ఆదివారం 07 జూన్ 2020
National - Mar 29, 2020 , 14:18:00

సునామీలా వ‌ల‌స కార్మికులు.. వైర‌స్ నియంత్ర‌ణ సాధ్య‌మా ?

సునామీలా వ‌ల‌స కార్మికులు.. వైర‌స్ నియంత్ర‌ణ సాధ్య‌మా ?

హైద‌రాబాద్‌: ల‌క్ష‌లాది మంది కార్మికులు ప‌ల్లెబాట ప‌ట్టారు. ప‌ట్ట‌ణాల్లో ప‌ని కోసం వ‌చ్చిన‌వారంతా.. ఇప్పుడు సొంత ఊళ్ల‌కు బారులు తీరుతున్నారు.  దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి యూపీ, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వెళ్లే వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉన్న‌ది.  య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే వ‌ద్ద జ‌నం సునామీలా విరుచుకుప‌డుతున్నారు. ఇక అక్క‌డ సామాజిక దూరం పాటించేవారే లేరు. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో జ‌నం జీవ‌నోపాధి కోల్పోయారు.  ఎలా బ్ర‌తుకాలో తెలియ‌డం లేదు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో వారంతా పుట్టినూళ్ల‌కు వెళ్తున్నారు. 

క‌రోనా సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవాలంటూ సామాజిక దూరం పాటించాలి. కానీ వ‌ల‌స కూలీల వ్య‌థ‌లు మ‌రోలా ఉన్నాయి. వారిని ఇంటికి చేర్చేవారు లేరు.  దాదాపు వంద కిలోమీట‌ర్ల దూరం కాలిబాట‌న న‌డిచేందుకు కొంద‌రు సాహ‌సం చేస్తున్నారు. ల‌క్ష‌లాది సంఖ్య‌లో ఉన్న వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు  ప్ర‌భుత్వం సుమారు వెయ్యి బ‌స్సులు ఏర్పాటు చేసింది. అయినా ఆ ఏర్పాట్లు మాత్రం స‌రిపోవ‌డం లేదు. ఆగ్రా, అలీఘ‌డ్‌, ల‌క్నో, కాన్పూర్‌, బీహార్ వెళ్లాల్సిన మ‌జ్దూరీలు బిక్కుబిక్కుమంటున్నారు. బ‌స్సులు ఎన్ని ఉన్నా.. జ‌నం అంత‌క‌న్నా ఎక్కువ ఉన్నారు. 

ఎంతో క‌ష్ట‌ప‌డి కూలీలంతా స్వంత ఊళ్ల‌కు వెళ్లినా.. అక్క‌డ వైర‌స్ కేసులు ఎక్కువ అయితే అదో పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది.  భారీ సంఖ్య‌లో వెళ్తున్న వీరంతా గ్రామాల‌కే ప‌రిమితంకానున్నారు. కానీ గ్రామాల్లో వైద్య స‌దుపాయాలు ఏమీ ఉండ‌వు. ఒక‌వేళ ఇంత సంఖ్య‌లో త‌ర‌లివెళ్తున్న ఈ కూలీలు వైర‌స్‌ను త‌మ ఊళ్ల‌కు మోసుకువెళ్తే ప‌రిస్థితి ఏంటి.  వారిని ఐసోలేట్ చేసేది ఎవ‌రు. వారికి చికిత్స‌ను అందించేది ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. 2017  ఆర్థిక స‌ర్వే ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా గ‌త అయిదేళ్ల‌లో సుమారు 14 కోట్ల జ‌నాభా వ‌ల‌స వెళ్లింది. అంటే వాళ్లంతా జీవ‌నోపాధి కోసం రాష్ట్రాల‌ను దాటారు. ఆ జాబితాలో యూనీ, బీహార్ వాళ్లే ఎక్కువ ఉన్నారు.  

క‌రోనా భ‌యం, జీవ‌నోపాధి కోల్పోవ‌డం వ‌ల్ల‌.. జ‌నం భారీ సంఖ్య‌లో స్వ‌గ్రామాల‌కు దారితీశారు. కానీ వీరంతా త‌మ వెంట క‌రోనాను తీసుకువెళ్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌తి రాష్ట్రం త‌న స‌రిహ‌ద్దు వ‌ద్ద .. ఇలా వ‌ల‌స వ‌స్తున్న వారిని ప‌రీక్షించాల్సి ఉంటుంది. ప్ర‌జ‌లంతా ఊళ్ల‌కు చేర‌క‌ముందే.. వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని గుర్తించాలి.  ఐసోలేష‌న్ సెంట‌ర్లు విరివిగా ఏర్పాటు చేయాలి. లేదంటే గ్రామాల్లోకి క‌రోనా వెళ్తే, ఇక అక్క‌డ ఆ మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డం క‌ష్టంగా మారుతుంది.


 


logo