శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 13:30:18

వ‌ల‌స కూలీల‌కు ట్రావెల్ అల‌వెన్స్‌..

వ‌ల‌స కూలీల‌కు ట్రావెల్ అల‌వెన్స్‌..

హైద‌రాబాద్‌:  లేబ‌ర్ కోడ్ బిల్లుల‌పై ఇవాళ రాజ్య‌స‌భ‌లో కేంద్ర కార్మిక‌, ఉద్య‌గశాఖ‌ మంత్రి సంతోష్ కుమార్  గంగావ‌ర్ మాట్లాడారు.  కాంగ్రెస్ స‌భ్యులు స‌భ‌లో లేర‌ని, వారు కార్మికుల ప‌క్షం కాదు అని ఆయ‌న అన్నారు. లేబ‌ర్ బిల్లుల‌ వ‌ల్ల సుమారు 50 కోట్ల మంది కార్మికుల‌కు సామాజిక భ‌ద్ర‌త ఏర్ప‌డుతుంద‌న్నారు.  ఆక్యుపేష‌న‌ల్ సేఫ్టీ, హెల్త్‌, వ‌ర్కింగ్ కండిష‌న్స్ కోడ్ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ..  వ‌ల‌స కూలీల‌కు ట్రావెల్ అల‌వెన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.  స్వంత రాష్ట్రాల‌కు వెళ్లాల‌నుకునే కూలీల‌కు ఏడాదికి ఒక‌సారి అల‌వెన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. కార్మికుల‌కు ఉచితంగా హెల్త్ చెక‌ప్ చేయ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  కార్మికులు స‌మ్మె చేసే అధికారాన్ని ప్ర‌భుత్వం లాక్కోలేద‌న్నారు. 14 రోజుల నోటీసు నియ‌మం ఉంద‌న్నారు.  

కార్మికుల కోడ్ బిల్లు గురించి మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ మాట్లాడుతూ.. లేబ‌ర్ చ‌ట్టాల్లో ఇన్నాళ్లూ కార్మికులు ఉక్కిరిబిక్కిర‌య్యార‌న్నారు. గ‌తంలో కేసుల‌న్నీ ట్రిబ్యున‌ల్‌కు వెళ్లేవ‌ని, వ‌ర్క‌ర్ల‌కు న్యాయం జ‌రిగేది కాదు అని, అయితే ఇక నుంచి కార్మికుల కేసుల‌న్నీ ఒక ఏడాదిలోనే ప‌రిష్కారం కానున్న‌ట్లు మంత్రి జ‌వ‌దేక‌ర్ చెప్పారు.  కార్మిక వ్య‌వ‌స్థ‌లో ఉన్న కాంట్రాక్టు వ్య‌వ‌స్థ‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని సామాజిక శాఖ మంత్రి రామ్‌దాస్ అత్వాలే తెలిపారు. లేబ‌ర్ కోడ్స్ బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  

మూడు లేబ‌ర్ కోడ్స్ బిల్లుల‌ను ఇవాళ రాజ్య‌స‌భ‌లో మంత్రి గంగావర్ ప్ర‌వేశ‌పెట్టారు.  ద ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్ కోడ్‌, ద ఆకుపేష‌న‌ల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వ‌ర్కింగ్ కండీష‌న్స్ కోడ్‌, ద కోడ్ ఆఫ్ సోష‌ల్ సెక్యూర్టీ బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. 29 కార్మిక చ‌ట్టాల‌ను నాలుగు కోడ్‌లు విభ‌జించిన‌ట్లు మంత్రి తెలిపారు. అయితే 2019లోనే ద కోడ్ ఆన్ వేజెస్ బిల్లును పార్ల‌మెంట్‌లో పాస్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.