శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 15:43:53

విరిగిన కాలుతో కాలినడకన సొంతూరుకు

విరిగిన కాలుతో కాలినడకన సొంతూరుకు

హైదరాబాద్‌: పొట్టకూటికోసం పొరుగూరు వెళ్లాడు. పనిచేస్తున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు కాలువిరిగింది. ఇంతలోనే కరోనా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. చేయడానికి పనిలేక, చేయాలన్నా కాలు విరగడంతో, చేసేదేంలేక సొంతూరుకు పయనమయ్యాడు. వాహనాల్లో ఎలాగోలా కొంతదూరం చేరుకున్నాడు. ఇంకా పల్లెకు పోవాలంటే కాళ్లకు పనిచెప్పాల్సిందే. కానీ కాలుకు పట్టీ. నడవలేని దైన్యమైన పరిస్థితి. దీంతో చేసేందేమీలేక ఆ సిమెంట్‌ పట్టీ విప్పి విరిగిన కాలుకే పనిచెప్పాడు. అప్పుడు తీసిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

రాజస్థాన్‌కు చెందిన భన్వర్‌లాల్‌ అనే యువకుడు పనికోసం మధ్యప్రదేశ్‌కు వలసవెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని పిపారియా పట్టణంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు అతని ఎడమకాలు విరిగింది. చికిత్స చేయించుకుని పిపారియాలో ఉంటున్నాడు. అయితే దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రధాని మోదీ ఈ నెల 25న లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో కాలుకు కట్టుతో వాహనాలు మారుతూ కొంతదూరం చేరుకున్నాడు. అయితే రాజస్థాన్‌లోని తన సొంతూరుకు ఇంకా 250 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాడు. అప్పటికే తనవద్ద ఉన్న డబ్బులు అయిపోడంతో కాళ్లకు పనిచేప్పాల్సి వచ్చింది. అయితే కాలుకు ఉన్న సిమెంటు పట్టీ నడవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని ఓ హైవేపై తన కాలుకున పట్టీనీ కత్తెరతో కట్‌ చేస్తూ ఉన్నప్పుడు అక్కడివారు ఫొటోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడది వైరల్‌గా మారింది.  


logo