బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 11:22:04

లాగుడు బండిపై గర్భిణి 700 కి.మీ. ప్రయాణం

లాగుడు బండిపై గర్భిణి 700 కి.మీ. ప్రయాణం

భోపాల్‌ : కరోనా లాక్‌డౌన్‌ గర్భిణులకు కష్టాలు తెచ్చిపెట్టింది. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో.. వందల కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెత్తిన సంచి పెట్టుకుని, లేదంటే భుజాన ఓ బిడ్డను వేసుకుని గర్భిణులు కాలినడకన తమ సొంతూర్లకు వెళ్తున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు లాక్‌డౌన్‌లో అనేకం చూస్తున్నాం. 

మధ్యప్రదేశ్‌కు చెందిన రాము అనే వ్యక్తి తన భార్య, కూతురితో హైదరాబాద్‌కు వలసొచ్చాడు. లాక్‌డౌన్‌ విధించడంతో పనులు నిలిపివేయడంతో.. వారికి ఉపాధి కరువైంది. ప్రస్తుతం రాము భార్య గర్భిణి. మధ్యప్రదేశ్‌లోని సొంతూరుకు వెళ్లాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. అయితే భార్య, కూతురు 700 కిలోమీటర్లు నడవలేరని భావించాడు రాము. దీంతో కర్రలు, చెక్కతో ఓ లాగుడు బండిని తయారు చేశాడు. ఆ లాగుడు బండిపై గర్భిణితో పాటు బిడ్డను కూర్చోబెట్టి.. 700 కిలోమీటర్లు రాము నడక సాగించాడు. మార్గమధ్యలో పోలీసులు వారికి బిస్కెట్లు, ఆహారం పంపిణీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం రాము కుటుంబం సొంతూరికి చేరుకుంది. 

సొంతూరిలోకి అడుగుపెట్టే ముందు తమకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాము తెలిపాడు. 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించినట్లు అతను పేర్కొన్నాడు. logo