శుక్రవారం 29 మే 2020
National - Mar 28, 2020 , 14:46:56

సొంతూళ్ల‌లో కుటుంబాల‌తో క‌లిసి చావ‌డం మేలు.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వ‌ల‌స కూలీల ఆవేద‌న‌

సొంతూళ్ల‌లో కుటుంబాల‌తో క‌లిసి చావ‌డం మేలు.. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వ‌ల‌స కూలీల ఆవేద‌న‌

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ ఎవ‌రిపై ఎలా ఉన్నా వ‌ల‌స కూలీల‌ను మాత్రం తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న‌ది. ప‌నిచేసే చోటే ఉందామంటే ఉండ‌టానికి గూడు లేదు, తిన‌డానికి తిండి లేదు. ప్ర‌భుత్వాలు కొన్ని ప్రాంతాల్లో నిరాశ్ర‌యుల‌కు కూడు, గూడు సౌక‌ర్యం క‌ల్పిస్తున్నా.. ఆ సౌక‌ర్యాలు అంద‌రికీ అందుబాటులో లేవు. పోనీ సొంతూర్ల‌కు పోయి క‌లోగంజో తాగి బ‌తుకుదామంటే ర‌వాణా సౌక‌ర్యాలు లేవు. 

ముఖ్యంగా ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే ఢిల్లీలో వ‌ల‌స కూలీల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే వారంద‌రికీ వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం క‌ష్టంగా మారింది. దీంతో గ‌త రెండుమూడు రోజులుగా ప్ర‌భుత్వం వ‌స‌తి క‌ల్పిస్తుంద‌ని ఆశించిన వ‌ల‌స కూలీలు.. ఇప్పుడు ఆ ఆశ‌లు కూడా స‌న్న‌గిల్ల‌డంతో వంద‌ల కిలోమ‌ట‌ర్ల దూరంలో ఉన్న త‌మ  స్వ‌గ్రామాల‌కు కాలిన‌డ‌క‌నే బ‌య‌లుదేరుతున్నారు. చంటి పిల్ల‌ల‌ను చంక‌లేసుకుని, ప‌సిబిడ్డ‌ల‌ను న‌డిపిస్తూ వారు ప‌డుతున్న అవ‌స్థ‌లు వ‌ర్ణనాతీతం.

లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు ఇలా రోడ్ల‌పైకి రావ‌ద్దు క‌దా అన్న ప్ర‌శ్న‌లకు వారు గుండెల‌ను పిండేసే స‌మాధానాలు చెబుతున్నారు. త‌మ‌వి రెక్కాడితేగానీ డొక్కాడ‌ని బ‌తుకుల‌ని, ఏ రోజుకు ఆ రోజు ప‌నిచేస్తే గానీ రెండు పూట‌లా తిన‌లేని స్థితిలో ఉన్న మేము.. రోజుల‌కొద్దీ ప‌నిలేకుండా ఎన్నాళ్లు బ‌తుక‌గ‌ల‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వాలు చెబుతున్న‌ట్లుగా త‌మ‌కు రెండు పూట‌లా తిండి దొరికే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. చేతిలో డ‌బ్బులు లేక‌, తిన‌డానికి తిండిలేక ఊరుగానీ ఊర్లో చచ్చేబ‌దులు, సొంతూళ్ల‌లో కుటుంబాల‌తో క‌లిసి చావ‌డం మేల‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  


 


  


logo