శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 11:28:29

కారు ప్రమాదంలో వలస కార్మికుని మృతి

కారు ప్రమాదంలో వలస కార్మికుని మృతి

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ వలస కార్మికుల కష్టాలను రెట్టింపు చేస్తున్నది. చేసేందుకు పనిలేక, ఇంటికి వెళ్లాంటే సరైన రవాణా వసతులు లేక ఇంటిబాట పట్టిన కార్మికులను కరోనాకు తోడు.. విధి కూడా వారిని వెక్కిరిస్తూనే ఉన్నది. ఎలాగైనా సొంతూరికి చేరుకోవాలనుకుంటున్న వారు మర్గమధ్యలోనే అనంతలోకాలకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌తో ఢిల్లీలో చేసేందుకు పనులు లేకపోవడంతో తన స్వస్థలానికి సైకిల్‌తో బయల్దేరాడు బీహార్‌కు వలస కార్మికుడు 26 ఏండ్ల సఘీర్‌ అన్సారి. 

ఢిల్లీ నుంచి బీహార్‌లోని తన సొంతూరైన తూర్పు చంపారన్‌కు వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం ఉంటుంది. మే 5న తన ఏడుగురు స్నేహితులతో సైకిల్‌పై బయల్దేరాడు. సగం దూరం చేరుకోవడానికి వారికి ఐదు రోజులు పట్టింది. శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి సమీపంలో అల్పాహారం కోసం ఆగారు. రోడు మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని టిఫిన్‌ చేస్తుండగా లక్నో నుంచి వస్తున్న కారు ఒక్కసారిగా వారిపై దూసుకొచ్చింది. దీంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఏడుగురు చిన్నచిన్న గాయాలతో తప్పించుకున్నారు. ఓ ఎన్‌జీవో సహకారంతో చికిత్స కోసం దవాఖానకు తరలిస్తుండగానే అన్సారి మృతిచెందాడు. కారు డ్రైవరును అరెస్టు చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అన్సారి మృతదేహాన్ని అంబులెన్సులో వారి స్వస్థలానికి పంపించారు. అన్సారీకి భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 


logo