బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 13:35:27

సైకిల్‌పై వలస కార్మికుల ప్రయాణం.. భార్యాభర్తలు మృతి

సైకిల్‌పై వలస కార్మికుల ప్రయాణం.. భార్యాభర్తలు మృతి

లక్నో : ఇది హృదయ విదారకం.. బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు రోడ్డుప్రమాదానికి బలయ్యారు. సొంతూరికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని మార్గమధ్యలోనే మృత్యువు కాటేసింది. ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. 

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కృష్ణ సాహు(45), ప్రమీల(40) దంపతులు ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు కొన్నేళ్ల క్రితం వెళ్లారు. వీరికి ఇద్దరు సంతానం.. ఇద్దరి వయసు కూడా ఐదేళ్లలోపే. కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ఈ కుటుంబానికి ఉపాధి దొరకడం కష్టమైంది. దీంతో తమ సొంతూరికి వెళ్లాలని సాహు దంపతులు నిర్ణయించుకున్నారు. 

గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని తమ సొంతూరుకి సైకిల్‌పై బయల్దేరారు. లక్నోకు సమీపంలోని షాహీద్‌ పాథ్‌ వద్ద సైకిల్‌పై వెళ్తున్న సాహు కుటుంబాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సైకిల్‌ ముక్కలు ముక్కలైంది. సాహు, ప్రమీల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పసి పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. 

ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడున్న ఓ ఫోటో ఆధారంగా మృతులను గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. సాహు సోదరుడు అక్కడికి చేరుకుని మృతదేహాలను గుర్తించాడు. పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. logo