e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home Top Slides అర్ధరాత్రి గెజిట్‌… కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు

అర్ధరాత్రి గెజిట్‌… కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు

అర్ధరాత్రి గెజిట్‌… కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు
 • కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు
 • రెండు రాష్ర్టాల్లోని 107 జలవనరులు బోర్డుల చేతికి
 • చెరువులు, కాల్వలు, తూములు వాటి పరిధిలోకే
 • విద్యుత్తు కేంద్రాలనూ స్వాధీనం చేసుకోనున్న కేంద్రం
 • మిషన్‌ భగీరథ కూడా కేంద్ర సర్కారు నియంత్రణలోకే
 • బోర్డుల నిర్వహణకు చెరో 400 కోట్ల డిపాజిట్‌కు ఆదేశం
 • అక్టోబర్‌ 14 నుంచి అమలుచేస్తామన్న జల్‌శక్తి శాఖ

ఉమ్మడి పాలనలో దశాబ్దాల తరబడి తెలంగాణ జల దోపిడీకి గురైతే.. అదేమని అడిగిన నాథుడు లేడు. పట్టించుకున్న జాతీయ పార్టీ లేదు. రెండు జీవ నదుల మధ్య నెలవైన తెలంగాణ నేల చుక్క నీటి కోసమూ కటకటలాడినప్పుడు.. కన్నెత్తి చూసిన కేంద్రం లేదు. కనికరించి చేసిన సాయం లేదు. కొట్లాడి, కొత్త రాష్ట్రం తెచ్చుకొని, అప్పో సప్పో చేసి, చెరువులు, ప్రాజెక్టులు బాగు పరుచుకొని, పొలాలకు నీళ్లు పారించుకొని, ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తరుణంలో… తెలంగాణకు మేలు చేసేందుకు ఎన్నడూ గుర్తుకురాని రాష్ట్ర విభజన చట్టం.. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది.

రాష్ర్టాల మధ్య వివాదం నెపంతో… కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులనూ, జల వనరులనూ తన అధీనంలోకి తీసుకోనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్లు ఇచ్చింది. అక్టోబర్‌ 14 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చిన తర్వాతే బోర్డుల పరిధి ఖరారు చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. తెలంగాణలో కాకతీయులు కట్టిన చెరువులు, తాగునీటి కోసం చేసుకున్న మిషన్‌ భగీరథ సహా చిన్నా, పెద్ద 79 జలవనరులను బోర్డుల పరిధిలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. కేంద్ర వైఖరిని తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై జల వనరుల శాఖ అధికారులతో, న్యాయ నిపుణులతో సమీక్ష జరిపారు. కేంద్ర వైఖరిని పార్లమెంటులో ఎండగట్టాల్సిందిగా ఎంపీలకు పిలుపునిచ్చారు.

అన్ని ప్రాజెక్టులూ బోర్డుల పరిధిలోకి

- Advertisement -

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చాం. గెజిట్‌లో కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులతోపాటు ఆమోదించనివి కూడా ఉన్నాయి. వాటిపై సమగ్ర వివరణ ఇచ్చాం. గెజిట్‌లో ప్రస్తావించినంత మాత్రాన.. ఇంతవరకు ఆమోదం పొందని ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్టుగా భావించవద్దు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన బరాజ్‌లు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, నియంత్రణ వ్యవస్థలు, కాల్వల నెట్‌వర్క్‌, సరఫరా వంటివన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్తాయి. ఇరు రాష్ర్టాల అవసరాలు, ప్రతిపాదనల మేరకు నీటి విడుదల ఉంటుంది. –కేంద్ర జల్‌శక్తి సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్థి

107 కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్లనున్న మొత్తం ప్రాజెక్టులు

79 తెలంగాణ పరిధిలోనివి

ఏపీ పరిధిలోనివి :15
ఉమ్మడి ప్రాజెక్టులు:13

కేఆర్‌ఎంబీ 36 ప్రాజెక్టులు
తెలంగాణ పరిధిలోనివి: 21
ఏపీ పరిధిలోనివి :07
ఉమ్మడి ప్రాజెక్టులు: 08

జీఆర్‌ఎంబీ 71 ప్రాజెక్టులు
తెలంగాణ పరిధిలోనివి: 58
ఏపీ పరిధిలోనివి: 08
ఉమ్మడి ప్రాజెక్టులు: 05

హైదరాబాద్‌, జూలై 16 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి తీరని అన్యాయం.. అంతా నిద్రపోతున్నవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై జల కొరడా ఝళిపించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అత్యంత ప్రాధాన్యమైన నదీజలాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నది. కొత్త ట్రిబ్యునల్‌ వేసి.. రెండు రాష్ర్టాల మధ్య జలాల పునః పంపిణీ జరిగిన తర్వాతే రివర్‌ బోర్డుల పరిధిని నోటిఫై చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల పరిధులను ఖరారుచేస్తూ.. గురువారం అర్ధరాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ గెజిట్‌ను విడుదలచేసింది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చింది. ప్రాజెక్టులతోపాటు విద్యుత్‌ కేంద్రాలనూ తన నియంత్రణలోకి తెచ్చుకున్నది. దారుణమేమిటంటే.. చెరువులు, తూములు, కాలువలు, చివరకు మిషన్‌ భగీరథను కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడో నిజాం కాలంనాడు కట్టిన చెరువులు, తాగునీటి రిజర్వాయర్లను కూడా బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చిపెట్టారు. దుర్మార్గం ఏమిటంటే గెజిట్‌పై భారత ప్రభుత్వ ప్రెస్‌కు సంబంధించిన ఉన్నతాధికారి అలోక్‌ కుమార్‌ గురువారం (15-7-2021) రాత్రి 10 గంటల 36 నిమిషాల 45 సెకన్లకు (10:36:45) డిజిటల్‌ సంతకం చేశారు. కానీ దానిని వెంటనే విడుదల చేయకుండా ఆపి, అర్ధరాత్రి దాటిన తర్వాత బహిర్గతపర్చారు. అక్టోబర్‌ 14 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

తూములు, కాలువలతో సహా
గెజిట్‌లోని అంశాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, బరాజ్‌లు, ఆనకట్టలు, కాలువలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, తూములు, స్లూయిస్‌ గేట్లు, ఎత్తిపోతల పథకాలు, పంట పొలాలకు నీళ్లు సరఫరాచేసే కాలువలు.. కట్టినవి.. కడుతున్నవి.. నిర్వహణలో ఉన్నవి, లేనివి అనీ బోర్డుల పరిధిలోకి తెచ్చారు. ఎప్పుడో నిజాంకాలంలో నిర్మించిన సదర్‌మాట్‌ ఆనకట్ట, ఉస్మాన్‌సాగర్‌నుకూడా బోర్డు పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. మిషన్‌ భగీరథ కూడా బోర్డుల పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రాజెక్టులే కాదు.. కాలువలు, తూములు, పంట కాలువలుకూడా ఆయా బోర్డుల పరిధిలోకి తెచ్చారు. మనం పంట పండించుకోవాలన్నా.. నీళ్లు కావాలన్నా ఏమీ చేయలేని విధంగా తెలంగాణ నోరు నొక్కి కాళ్లు చేతులు కట్టేసిన విధంగా కేంద్రం గెజిట్‌ను జారీచేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విడిపోయినా ఆగని అన్యాయం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముఖ్యకారణమైన అంశం నీళ్లే. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న అంశంపైనే తెలంగాణ దశాబ్దాలపాటు కడుపు కట్టుకొని పోరాటం చేసింది వీటికోసమే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు రాష్ర్టాల మధ్య నదీ జలాల పునఃపంపకం జరుగాలని, ఇందుకోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ వేయాలని తెలంగాణ ఏడేండ్లుగా కోరుతూనే ఉన్నది. ట్రిబ్యునళ్ల ఏర్పాటు తర్వాతే నదీ జలాల బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ఇందుకోసం కేంద్రం కోరిక మేరకు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకొన్నది. ఇందుకు సంబంధించిన సమాచారం కూడా కేంద్రానికి అందించింది. కేంద్ర ప్రభుత్వం వీటినేవీ పరిగణనలోకి తీసుకోకుండా బోర్డుల పరిధిని నిర్ణయించేసింది.

కేంద్రం చేతిలోకి ఇరిగేషన్‌
రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 7లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాను పొందుపర్చారు. దీనిప్రకారం నీటిపారుదల అనేది పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం. దీనిపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్‌, బరాజ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్‌ నిర్మాణాలు, కాలువలు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు.. ఇలా అయా రాష్ట్రాల నీటి అవసరాలకు అనుగుణంగా నిర్మించుకుంటాయి. కానీ, తాజాగా విడుదల చేసిన గెజిట్‌తో ఇవన్నీ రాష్ట్రం చేతినుంచి.. కేంద్రం ఆధీనంలో పనిచేసే బోర్డుల పరిధిలోకి వెళ్లిపోతాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేసేందుకు నిర్ణీత నిబంధనలు ఉన్నాయి. ఆర్టికల్‌ 249 ప్రకారం.. జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని ఏదేని అంశంపై చట్టం చేయాలని పార్లమెంట్‌ను కోరుతూ రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం చేస్తుంది. ఆ మేరకు పార్లమెంట్‌కు ఆ అంశంపై చట్టంచేసే అధికారం ఉంటుంది. ఈ చట్టం ఒక ఏడాదిపాటు మాత్రమే అమల్లో ఉంటుంది. దానిని పొడిగించాలంటే మళ్లీ అదే విధానం అనుసరించాలి. ఆర్టికల్‌ 250 ప్రకారం.. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశంమీద పార్లమెంట్‌ చట్టంచేసే వీలుంటుంది. ఇది ఆరు నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆర్టికల్‌ 262 ప్రకారం.. జల వివాదాల పరిష్కారానికి భారత పార్లమెంట్‌ జల వివాదాల ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేస్తుంది. 1956లో రాష్ట్రాల పునర్విభజించిన తర్వాత ఇందుకోసం జల వివాదాల చట్టం తెచ్చింది. ఇప్పటివరకు మొత్తం 8 జల వివాదాల ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. 1969లో బచావత్‌ ట్రిబ్యునల్‌, 2004లో బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఈ ప్రకారమే ఏర్పాటయినవే.

కేంద్రం గెజిట్‌లో ముఖ్యాంశాలు

 • కృష్ణా, గోదావరి బేసిన్లను మొత్తంగా కేంద్రం తన ప్రత్యక్ష అధికార పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ గెజిట్‌ ప్రకారం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ అధికార పరిధి 14 అక్టోబర్‌ 2021 నుంచి ప్రారంభమవుతుంది.
 • కేఆర్‌ఎంబీ పరిధిలోకి 36 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. ఇందులో తుంగభద్ర ప్రాజెక్టు నుంచి మొదలుకుని పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌, పాకాల సరస్సు, వైరా సరస్సు, లంకాసాగర్‌తోపాటు.. శామీర్‌పేట చెరువు కూడా ఉన్నది.
 • జీఆర్‌ఎంబీ పరిధిలోకి ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన సదర్‌మాట్‌ మొదలుకొని చిన్నా, చితకా ప్రాజెక్టులు, కాలువలు, తూములను కూడా వదలలేదు. వరంగల్‌ సమీపంలోని గీసుకొండ వద్ద కాకతీయ కెనాల్‌పై ఉన్న క్రాస్‌ రెగ్యులేటర్‌ను కూడా జీఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చారు.
 • ఆయా ప్రాజెక్టుల పరిధిలో మంజూరైన (శాంక్షన్‌) సిబ్బంది, ఉద్యోగులందరూ.. ఇకపై ఆయా బోర్డుల పరిధిలోకి వస్తారు. బోర్డుల పాలనలోనే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
 • ప్రాజెక్టులే కాదు.. షెడ్లు, యంత్రాలు, పరికరాలు, సామగ్రిని నిల్వచేసే స్టోర్స్‌ కూడా బోర్డుల పరిధిలోకే వస్తాయి.
 • కార్యాలయాలు, వాటి భవనాలు, ఫర్నిచర్‌, వాహనాలు, రికార్డులు, డాక్యుమెంట్లుకూడా బోర్డుల పరిధిలోకి వస్తాయి.
 • అరవై రోజుల వ్యవధిలో రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు చెరో రూ.400 కోట్ల చొప్పున బోర్డుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా అవసరాలుంటే.. బోర్డు కోరిన 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు విడుదలచేయాలి.
 • బోర్డుల ఆదేశాల మేరకే.. జల విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అంశాలను రాష్ర్టాలు చేపట్టాల్సి ఉంటుంది.
 • బోర్డుల అజమాయిషీలో సీఐఎస్‌ఎఫ్‌ ఈ ప్రాజెక్టులు, బ్యారేజీల వద్ద భద్రతను చూసుకుంటాయి.
 • రెండు రాష్ర్టాల నుంచి బోర్డు చైర్మన్‌గా గానీ, సభ్య కార్యదర్శిగా కానీ, సభ్యుడిగా కానీ, చీఫ్‌ ఇంజనీర్‌గా కానీ ప్రతినిధులు ఉండకూడదు.
 • కేఆర్‌ఎంబీ పరిధిపై, ఇతరత్రా సమస్యలు వచ్చినప్పుడు కేంద్రం తీసుకొనే నిర్ణయమే అంతిమం. అంటే జలాలపై కేంద్రానికే పూర్తి అజమాయిషీ ఉంటుంది.

గెజిట్‌ మూడు షెడ్యూళ్లలోని ముఖ్యాంశాలు

 • షెడ్యూల్‌-1: ఈ జాబితాలో ఉన్న బరాజ్‌లు, డ్యాములు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్‌ స్ట్రక్చర్‌ వంటి హెడ్‌ వర్క్స్‌, వాటి పరిధిలోని కాలువల వ్యవస్థ, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు పూర్తిగా కృష్ణాబోర్డు ఆధీనంలోకి వెళ్తాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ ఆధీనంలోకి వెళ్తాయి. వాటి నిర్వహణ బాధ్యత కేఆర్‌ఎంబీదే. షెడ్యూల్‌-1లో మొత్తం 36 ప్రాజెక్టులు ఉన్నాయి.
 • షెడ్యూల్‌-2: ఈ జాబితాలోని 12 ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్‌, కాలువల వ్యవస్థ, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వస్తాయి. వాటి నిర్వహణను (అడ్మినిస్ట్రేషన్‌, ఆపరేషన్‌, మెంటెయినెన్స్‌, రెగ్యులేషన్‌) కేఆర్‌ఎంబీ చూసుకుంటుంది.
 • షెడ్యూల్‌-3: ఈ జాబితాలో ఉన్న 35 ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వస్తాయి. అయితే వాటి నిర్వహణ బాధ్యతలు మాత్రం ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుంది. అదికూడా కేఆర్‌ఎంబీ సూచనల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది.

గెజిట్‌లో కానరాని ఆర్డీఎస్‌ కుడికాలువ, సీమ లిఫ్ట్‌
‘కృష్ణా, గోదావరి నదీజలాల్లో కడుతున్న, కట్టనున్న, కట్టబోతున్న, అనుమతులు ఉన్న, లేని ప్రాజెక్టులన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్నాం’.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధుల గెజిట్‌ విడుదల నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్థి చెప్పిన మాటలివి. మరి ఇటీవలి కాలంలో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువ పనుల గురించి గెజిట్‌లో ప్రస్తావన కూడా చేయలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఆర్డీఎస్‌ కుడికాలువ పనులు, సీమ లిఫ్ట్‌ పనులను వెంటనే ఆపేయాలని కృష్ణాబోర్డు ఆదేశాలను ఏపీ ఎంతమాత్రం పట్టించుకోకుండా నిఘా నీడన పనులు చేయిస్తున్నది. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేసిన కేంద్రం.. వాటిని గెజిట్‌లో పేర్కొనకపోవడంపై జలనిపుణులు విమర్శిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్ధరాత్రి గెజిట్‌… కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు
అర్ధరాత్రి గెజిట్‌… కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు
అర్ధరాత్రి గెజిట్‌… కేంద్రం గుప్పిట్లోకి ప్రాజెక్టులు

ట్రెండింగ్‌

Advertisement