మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 16:00:18

యువతకు డిజిటల్‌ స్కిల్స్‌లో శిక్షణ.. మైక్రోసాఫ్ట్‌ సహకారం

యువతకు డిజిటల్‌ స్కిల్స్‌లో శిక్షణ.. మైక్రోసాఫ్ట్‌ సహకారం

న్యూ ఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా దేశంలోని లక్షమంది యువతలో డిజిటల్‌ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ)కు ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సహకారం అందించనుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు బుధవారం తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌, ఎన్‌ఎస్‌డీసీ ఈ స్కిల్‌ ఇండియన్‌పోర్టల్‌తో కలిసి డిజిటల్‌ స్కిల్స్‌ పెంచేందుకు అభ్యాస వనరులను సమకూర్చడం, అవేర్‌నెస్‌ డ్రైవ్‌లు నిర్వహించడంతోపాటు డిజిటల్‌ ఎకానమీ అభివృద్ధి చెందేందుకు అవసరమైన నైపుణ్యాలను యువకుల్లో పెంపొందించనుంది. ఎంట్రీ-లెవల్ డిజిటల్ అక్షరాస్యత నుంచి ఏఎల్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌లాంటి క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యం పెంచేందుకు మైక్రోసాఫ్ట్ తోడ్పడుతుంది.  

‘డిజిటల్‌ పరివర్తన వల్ల భారతదేశంలోని ప్రతీ పరిశ్రమలో టెక్-ఎనేబుల్డ్ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతున్నది. దీంతో యువతలో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.’ అని మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షులు అనంత్ మహేశ్వరి పేర్కొన్నారు. ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం భారతదేశ శ్రామిక శక్తిని సిద్ధం చేసేందుకుగానూ డిజిటల్ నైపుణ్యాల పెంపుపై మేం దృష్టిసారించాం. ఎన్‌ఎస్‌డీసీతో మా భాగస్వామ్యం ఆ దిశలో ఒక బలమైన అడుగు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోయేలా యువకులకు అవసరమైన టెక్నాలజీని అందిస్తాం’ అని తెలిపారు. ఎన్‌ఎస్‌డీసీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్‌కుమార్‌ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వాతావరణంలో యువశ్రామికశక్తి ఉపాధిని పెంచేందుకు డిజిటల్‌ స్కిల్స్‌ అవసరమని, ఆన్‌లైన్ అభ్యాసాన్ని వేగవంతం చేయడం కోసమే మైక్రోసాఫ్ట్‌ సహకారం తీసుకున్నట్లు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo