ఆదివారం 24 జనవరి 2021
National - Dec 17, 2020 , 15:09:42

ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు డిప్యూటేష‌న్‌

ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు డిప్యూటేష‌న్‌

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై గ‌త వారం కోల్‌క‌తాలోని డైమండ్ హార్బ‌ర్‌కు వెళ్తుండ‌గా రాళ్ల దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్లు నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఈ దాడి జ‌రిగిన‌ట్లు కేంద్ర హోంశాఖ వ‌ర్గాలు నిర్ధారించాయి. చ‌ర్య‌ల్లో భాగంగా ఆ ముగ్గురు ఐపీఎస్‌ల‌ను డిప్యూటేష‌న్‌పై కేంద్ర విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు హోంశాఖ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. భోలానాథ్ పాండేను బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్, డెవ‌ల‌ప్‌మెంట్ ఎస్పీగా(నాలుగేళ్ల పాటు), ప్ర‌వీణ్ త్రిపాఠిని స‌హ‌స్ర్త సీమా బాల్ డీఐజీగా(ఐదేళ్ల పాటు),  రాజీవ్ మిశ్రాను ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఐజీగా(ఐదేళ్ల పాటు) విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఈ మేర‌కు బెంగాల్ డీజీపీ, హోం సెక్ర‌ట‌రికీ కేంద్ర హోంశాఖ లేఖ పంపింది.  

ప్ర‌స్తుతం భోలానాథ్ పాండే డైమండ్ హార్బ‌ర్ ఎస్పీగా, రాజీవ్ మిశ్రా సౌత్ బెంగాల్ ఏడీజీగా, ప్ర‌వీణ్ త్రిపాఠి ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీగా కొన‌సాగుతున్నారు. 

రాజ్యాంగ విరుద్ధం : సీఎం మ‌మ‌త‌

కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వుల‌పై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఐపీఎస్ అత్య‌వ‌స‌ర నిబంధ‌న‌ల‌ను కేంద్రం దుర్వినియోగ ప‌రుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి చ‌ర్య‌లు స‌రికావు అని పేర్కొన్నారు. ఈ చ‌ర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని మమ‌త స్ప‌ష్టం చేశారు. 


logo