శుక్రవారం 05 జూన్ 2020
National - Jan 24, 2020 , 17:19:33

ఎంజీ హెక్టార్‌ కారులో మంటలు

ఎంజీ హెక్టార్‌ కారులో మంటలు

ఢిల్లీ: ఎంజీ మోటార్స్‌కు చెందిన ఎంజీ హెక్టార్‌ కారు ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఆ కారును కొనుగోలు చేసేందుకు అప్పట్లో ఆసక్తి కనబరిచారు. అయితే ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఆ కారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారినట్లు అర్థమవుతున్నది. ఢిల్లీలో ఎంజీ హెక్టార్‌ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన తాజాగా చోటు చేసుకోగా ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఢిల్లీలో ఎంజీ హెక్టార్‌ కారుకు చెందిన 1.5 లీటర్‌ పెట్రోల్‌ డీసీటీ షార్ప్‌ వేరియెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే మంటల్లో కాలిపోతున్న ఆ వాహనాన్ని తీసిన ఫొటో ఒకటి నెట్‌లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కాగా గత డిసెంబర్‌ 26న ముంబైలోని బాంద్రాలోనూ ఇదే కారుకు చెందిన 2.0 లీటర్‌ డీజిల్‌ ఎంటీ షార్ప్‌ వేరియెంట్‌లోనూ మంటలు చెలరేగాయి. ఇక మరో ఘటన ఇటీవలే ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఎంజీ హెక్టార్‌ కారులో క్లచ్‌ సమస్య రావడంతో విసుగెత్తిన కస్టమర్‌ ఆ కారును గాడిదకు కట్టి లాగించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ సమస్యను పరిష్కరించామని ఎంజీ మోటార్స్‌ తెలిపింది. కాగా ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాద సంఘటనలపై మాత్రం ఎంజీ మోటార్స్‌ ఇంకా స్పందించలేదు. ఇక ఆ కారులో బిగించిన యాక్ససరీల వల్లే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. 


logo