బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 03:06:51

బహిష్ఠులో ఉన్నప్పుడు వంట చేస్తే కుక్కలై పుడతారు

బహిష్ఠులో ఉన్నప్పుడు వంట చేస్తే కుక్కలై పుడతారు
  • ఆ వంట తిన్న భర్తలు ఎద్దులుగా జన్మిస్తారు
  • స్వామి నారాయణ్‌ ఆలయ పూజారి
  • స్వామి కృష్ణస్వరూప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 18: రుతుస్రావంలో ఉన్న మహిళలు తమ భర్తల కోసం వంట చేస్తే వచ్చే జన్మలో ఆడ శునకాలుగా జన్మిస్తారని గుజరాత్‌లోని స్వామినారాయణ్‌ ఆలయానికి చెందిన పూజారి స్వామి కృష్ణస్వరూప్‌ దాస్‌జీ సెలవిచ్చారు. ఆ భోజనం తిన్న భర్తలు వచ్చే జన్మలో ఎద్దులుగా పుడతారని పేర్కొన్నారు. ఈ విషయం శాస్ర్తాలలో స్పష్టంగా ఉన్నదని ఉద్ఘాటించారు. గుజరాత్‌లోని భుజ్‌లో ఇటీవల 60 మంది విద్యార్థినులకు రుతుస్రావ పరీక్షలు జరిపి వివాదంలో చిక్కుకున్న శ్రీ సహజానంద్‌ బాలికల కళాశాలను స్వామినారాయణ్‌ ఆలయం ట్రస్ట్‌ నిర్వహిస్తుండటం గమనార్హం. 


‘బహిష్ఠులో ఉన్న స్త్రీలు చేసిన వంటను తిన్న పురుషులు వచ్చే జన్మలో ఎద్దులై పుడతారు.. ఇది నిశ్చయం’ అని ఆ స్వామీజీ పేర్కొన్నారు. తన అభిప్రాయాలు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఈ విషయాలన్నీ మన శాస్ర్తాల్లో రాసి ఉన్నాయని చెప్పారు. ఆలయానికి వచ్చిన ప్రజలనుద్దేశించి సదరు స్వామి గుజరాతీలో ప్రసంగించారు. స్వామి నారాయణ్‌ ఆలయంలోని ‘నర్‌-నారాయణ్‌ దేవ్‌గడీ’ శాఖలో స్వామి కృష్ణస్వరూప్‌ 1995 నుంచి పనిచేస్తున్నారు.  రుతుస్రావం మహిళలకు ఓ శిక్ష వంటిదన్నారు. ‘రుతుస్రావ సమయం ఓ తపస్సు వంటిదన్న విషయాన్ని మహిళలు గ్రహించలేరు. ఇది మన శాస్ర్తాల్లో ఉంది.


రుతుస్రావం సమయంలో స్త్రీలు వంటగదికి దూరంగా ఉండాలి గనుక.. పురుషులు వంట చేయడం నేర్చుకోవాలి’ అని చెప్పారు. స్వామినారాయణ్‌ ఆలయానికి చెందిన పూజారులు చేసిన ఇటువంటి ప్రసంగాల వీడియోలు ఆలయానికి సంబంధించిన యూట్యూబ్‌ చానెల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం ట్రస్ట్‌ నిర్వహిస్తున్న శ్రీసహజానంద్‌ బాలికల విద్యా సంస్థలో విద్యార్థినులపై పలు ఆంక్షలు అమలులో ఉన్నాయి. హాస్టల్‌లో ఉండే విద్యార్థినులు రుతుస్రావం సమయంలో తోటివారితో కలిసి భోజనం చేయరాదని నిబంధనలు అక్కడ ఉన్నాయి. ఈ నిబంధనలను అతిక్రమించారన్న ఆరోపణపైనే ఈ నెల 11న కళాశాల ప్రిన్సిపాల్‌ రీటా రణింగా, హాస్టల్‌ రెక్టర్‌ రమలీబెన్‌ హిరానీలు 60 మంది విద్యార్థినులకు రుతుస్రావ పరీక్షలు జరిపారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రిన్సిపాల్‌, రెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


logo