ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 17:56:04

మెహబూబా ముఫ్తీ నిర్బంధం మ‌రో మూడు నెల‌లు పొడిగింపు

మెహబూబా ముఫ్తీ నిర్బంధం మ‌రో మూడు నెల‌లు పొడిగింపు

శ్రీన‌గ‌ర్‌: జమ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద మ‌రో మూడు నెలలు పొడిగించారు. పీపుల్స్ డెమాక్ర‌టిక్ పార్టీ (పీడీపీ) అధ్య‌క్షురాలైన ఆమె గ‌త ఏడాది ఆగ‌స్టు 5 నుంచి గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ఆమె ఇంటినే అనుబంధ జైలుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 60 ఏండ్ల ముఫ్తీపై పీఎస్ఏ చ‌ట్టం కింద తొలిసారి విధించిన ఆరు నెల‌ల నిర్బంధం ఆగ‌స్టు 5తో ముగియ‌నున్న‌ది. దీంతో ఆమె నిర్బంధాన్ని ఈ చ‌ట్టం కింద మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తూ జ‌మ్ముక‌శ్మీర్ పాల‌న యంత్రాంగం శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

జ‌మ్ముక‌శ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది ఆగ‌స్టు 5న ర‌ద్దు చేయ‌డంతోపాటు ఆ రాష్ట్రాన్ని జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌ఢ‌క్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ‌జించింది. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల‌తో జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన రాజ‌కీయ పార్టీల నేత‌ల‌ను గృహ నిర్బంధం చేసింది. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత‌లు, మాజీ సీఎంలైన ఒమ‌ర్ అబ్దుల్లా, ఆయ‌న తండ్రి ఫ‌రూఖ్‌  అబ్దుల్లాపైనా పీఎస్ఏ చ‌ట్టాన్ని అమ‌లు చేసింది. కొన్ని నెల‌ల కింద‌ట ఈ నిర్బంధం నుంచి వీరిద్ద‌రు విడుద‌ల అయ్యారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సాజాద్ లోనిని కూడా ఐదు రోజుల కింద‌ట విడుద‌ల చేశారు.

అయితే మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగించ‌డంతో ఏడాదిపైగా గృహ నిర్బంధంలో ఉన్న వ్య‌క్తిగా ఆమె నిలువ‌నున్నారు. ప్ర‌జా భ‌ద్ర‌తా చ‌ట్టం (పీఎస్ఏ) కింద ఒక వ్య‌క్తిపై ఎలాంటి విచార‌ణ జ‌రుప‌కుండా నిర్బంధించ‌వ‌చ్చు. అలాగే ఆ నిర్బంధాన్ని ప‌లుమార్లు పొడిగించ‌వ‌చ్చు. కాగా, ఈ చ‌ట్టం అస‌లు చ‌ట్ట‌మే కాద‌ని అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల సంస్థ అమ్నెస్టీ ఆరోపిస్తున్న‌ది. logo