శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 13:50:04

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై మంత్రుల సమావేశం

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై మంత్రుల సమావేశం

హైదరాబాద్‌ : గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలపై శనివారం హైదరాబాద్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతితో పాటు గ్రేటర్‌ ఎమ్మెల్యేలు, బాలాపూర్‌, భాగ్యనగర్‌, ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో విగ్రహాల ఎత్తు, శోభాయాత్ర, కొవిడ్‌ రూల్‌, తాజా పరిస్థితిపై సమావేశంలో చర్చించారు.

సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో సతమతమవుతుందన్నారు.  ఈ పరిస్థితుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తే బాగుంటుందనే విషయమై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. ఇందులో కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారన్నారు. పండుగల సందర్భంగా ఎక్కడా ఆంక్షలు విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. గడిచిన ఐదేళ్లలో ఆంక్షలు పెట్టలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరి చేతుల్లో లేదని, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుందన్నారు.

ఉత్సవాల నిర్వహణపై వచ్చే వారంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్వహణపై చర్చిస్తామని, అవసరమైతే వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం వరకు మూడు, నాలుగు సమావేశాలు నిర్వహిస్తూ అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామన్నారు. మన భాగ్యనగరాన్ని, మన ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశ, ప్రపంచ చరిత్రలో ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo