ఆదివారం 05 జూలై 2020
National - Jun 19, 2020 , 02:43:37

అభూతకల్పనలు మానండి

అభూతకల్పనలు మానండి

  • చైనాకు భారత్‌ విదేశాంగశాఖ గట్టి కౌంటర్‌ 
  • గల్వాన్‌లో మూడోరోజూ చర్చలు విఫలం 

న్యూఢిల్లీ, జూన్‌ 18: గల్వాన్‌లో ఘర్షణ పై చైనా సైన్యం అభూతకల్పనలు, నిరాధార ప్రకటనలతో వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నదని భారత విదేశాంగశాఖ విమర్శించింది. గల్వాన్‌ ఎప్పటికీ చైనాదేనన్న ఆ దేశ సైన్యం ప్రకటనను నిర్దందంగా తోసిపుచ్చింది. సేనల ఉపసంహరణ కోసం ఈ నెల 6న ఇరు సైన్యాలకు చెందిన జనరల్‌ స్థాయి అధికారుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని గౌరవించాలని హితవు పలికింది. గల్వాన్‌ ఘర్షణలో భారత సైనికులు ఎవరూ గల్లంతు కాలేదని స్పష్టంచేసింది. మరోవైపు గల్వాన్‌లో సేనల ఉపసంహరణకు గురువారం జరిగిన ఇరుదేశాల మేజర్‌ జనరల్స్‌ స్థాయి చర్చలు విఫలమయ్యాయి.

బాధ్యతగా మెలగండి 

ఇరుదేశాల సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు చైనా బాధ్యతగా వ్యవహరించాలని భారత్‌ సూచించింది. తాజా పరిణామాలపై చైనా విదేశాంగమంత్రితో భారత విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ ఫోన్లో గురువారం చర్చించారు. ‘బాధ్యతాయుతమైన సరిహద్దు నిర్వహణ విధానంలో భారత్‌ చాలా స్పష్టంగా ఉంది. మా కార్యకలాపాలు మొత్తం మా సరిహద్దుకు లోపలే ఉంటాయి. చైనా కూడా అలాగే చేస్తుందని ఆశిస్తున్నాం’ అని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

76 మందికి గాయాలు

గల్వాన్‌ ఘర్షణలో 20  మంది భారత సైనికులు అమరులవగా మరో 76 మంది గాయపడ్డారని ఆర్మీవర్గాలు తెలిపాయి. అందరూ వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని, వారంతా త్వరలోనే విధుల్లో  చేరుతారని వెల్లడించాయి. 
logo