గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 07, 2020 , 12:21:12

ఆల్మట్టికి భారీ ఇన్ ఫ్లో.. గంటల్లో లక్ష క్యూసెక్కులు దాటిన వరద

ఆల్మట్టికి భారీ ఇన్ ఫ్లో.. గంటల్లో లక్ష క్యూసెక్కులు దాటిన వరద

హైదరాబాద్‌ : ముందుగా ఊహించినట్టుగానే కృష్ణానదికి భారీ వరద వస్తోంది. ఎగువ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి రిజర్వాయర్ వస్తున్న వరద గంటల వ్యవధిలోనే వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. నిన్న రాత్రికి రిజర్వాయర్‌కు 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ముందు జాగ్రత్తగా, 70వేల క్యూసెక్కులను కిందకు వదులుతుండగా, నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలానికి వస్తుంది. ఆల్మట్టి ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, ఇప్పటికే వంద టీఎంసీలకుపైగా నీరుంది. శనివారం నాటికి రిజర్వాయర్ పూర్తిగా నిండుతుందని, తర్వాత వచ్చే నీరందతా దిగువకు వదులుతామని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టుకు దాదాపు 70వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దాదాపు వంద టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 42 టీఎంసీల నీరుంది. వరద ఇలాగే ఉంటే నాలుగు రోజుల్లోనే రిజర్వాయర్‌ నిండనుంది. ఇదిలా ఉంటే టీబీ డ్యామ్‌ నుంచి కూడా అధికారులు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో వరద నీరంతా శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు చేరుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 77 టీఎంసీల నీరు ఉంది. అధికారుల అంచనా మేరకు వచ్చే వారంల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండనుంది.logo