మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 16:05:56

చమురు బావి వద్ద పేలుడు : ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

చమురు బావి వద్ద పేలుడు : ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

గౌహతి : అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన చమురు బావి బుధవారం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడ్డారు. అసోంలో టిన్సుకియా జిల్లాలో ఆయిల్‌ ఇండియాకు చెందిన చమురు బావిలో మంటలు చెలరేగి గత రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు వివిధ దేశాల నుంచి నిపుణులను రప్పించినప్పటికీ మంటలను అదుపుచేయడం సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలో బాగ్జస్‌ చమురుక్షేత్రంలో ఐదో బావి సమీపంలో భారీ పేలుడు సంభవించింది. గాయపడిన విదేశీ నిపుణులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించి.. మంటలను ఆర్పే కార్యక్రమాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. 

ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి త్రిదీప్ హజారికా ఈ సంఘటనను ధృవీకరించారు. పేలుడు తీవ్రత భారీగా ఉన్నదని చెప్పారు. బాగ్జన్ బావి వద్ద మంటలను అరికట్టడానికి కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ పేలుడు జరిగింది. గ్యాస్ బ్లోఅవుట్ జూన్ 9 నుండి ఉధృతంగా ఉన్నది. సహజ వాయువు బావిలోమంటలను అరికట్టడానికి వచ్చిన ఆరుగురు విదేశీ నిపుణులు కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. 

గత శనివారం బాగ్జన్ బ్లోఅవుట్ సైట్ వద్ద పనులను స్థానికులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఫలితంగా భారత అధికారులు, సింగపూర్ నుంచి ముగ్గురు, యూఎస్ నుంచి ఇద్దరు, కెనడా నుంచి వచ్చిన ఒకరు సైట్ వద్ద కుండపోత వర్షంలో గడపాల్సి వచ్చింది. స్థానికుడొకరు చనిపోవడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారంగా రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం వారు విదేశీయులను, భారత అధికారులను ఆదివారం తెల్లవారుజామున బయటకు వెళ్లేందుకు అనుమతించారు. జూన్ 9 న గ్యాస్ బావి మంటల్లో ఇల్లు దెబ్బతిన్న సుక్లేశ్వర్ నియోగ్ శనివారం పునరావాస శిబిరంలో విషం సేవించి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు.


logo