ఆదివారం 17 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:53:22

వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు ధ‌రించాల్సిందే: ICMR

వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు ధ‌రించాల్సిందే: ICMR

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారిని దేశంలో క‌ట్ట‌డి చేయ‌డం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని భారత వైద్య పరిశోధన మండలి ( ICMR) చీఫ్‌ ప్రొఫెసర్ బలరాం భార్గవ స్పష్టంచేశారు. టీకా వచ్చినా సరే ప్రజలు సుదీర్ఘకాలంపాటు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. కొవిడ్ వ్యాధి నిర్వహణ-మార్పులు అనే అంశంపై కోల్‌కతాలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు. టీకా రూపకల్పనలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తున్న‌ద‌ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది జూలై క‌ల్లా దేశంలోని 30 కోట్ల మందికి కరోనా టీకా వేయాలనేది త‌మ ల‌క్ష్య‌మ‌ని, ఆ తర్వాత‌ భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామ‌ని ప్రొఫెస‌ర్ భార్గ‌వ వెల్ల‌డించారు. మాస్కులు అంటే దుస్తులతో చేసిన టీకా లాంటివ‌ని, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు టీకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, అందులో రెండు భారత్‌లో తయార‌వుతుండ‌గా మిగతా మూడు విదేశాలకు చెందినవని తెలిపారు. 

అయితే, కరోనాను అంతం చేయాలంటే టీకా ఒక్కటే సరిపోదని బార్గవ అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక దూరం పాటించ‌డం, చేతుల‌ను త‌ర‌చూ శుభ్ర‌ప‌ర్చుకోవ‌డం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను ఇక‌పై కూడా కొనసాగించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.