సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 10:10:28

గుడ్ న్యూస్.. వాట్స‌ప్‌లో డిజిట‌ల్ చెల్లింపు సేవ‌లు

గుడ్ న్యూస్.. వాట్స‌ప్‌లో డిజిట‌ల్ చెల్లింపు సేవ‌లు

హైద‌రాబాద్ : సామాజిక మాధ్య‌మం వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపు సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ సేవ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించిన‌ట్లు ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌క‌టించారు. వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో నేటి నుంచి వాట్స‌ప్‌లో సుర‌క్షితంగా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగ‌దారులంద‌రికీ డిజిట‌ల్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ‌వాట్సప్ ద్వారా చేసే చెల్లింపుల‌కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని జుక‌ర్ బ‌ర్గ్ స్ప‌ష్టం చేశారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సుర‌క్షితంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. 

ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ తన పేమెంట్‌ సర్వీసును దేశీయంగా ప్రారంభించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గురువారం అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు గ్రేడెడ్‌ విధానంలో వాట్సాప్‌ తన సర్వీసులను ప్రారంభించనుంది. యూపీఐలో గరిష్ఠంగా రెండు కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లతో ఆరంభించి వాట్సాప్‌ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.

వాట్సాప్‌ గత రెండేళ్లుగా తన యూపీఐ ఆధారిత పేమెంట్‌ పైలెట్‌ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్‌ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతి లభించలేదు. తాజాగా ఎన్‌పీసీఐ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కాగా.. వాట్సాప్‌, గూగుల్‌పే లేదా ఫోన్‌పే వంటి సింగిల్‌ థర్డ్‌ పార్టీ సంస్థలు మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30 శాతం మాత్రమే నిర్వహించే విధంగా పరిమితి విధిస్తూ ఎన్‌పీసీఐ ప్రకటన చేసింది.