సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 03:13:11

‘అరకు’ హత్యాకాండతో సంబంధమున్నజిప్రో హబికా లొంగుబాటు

‘అరకు’ హత్యాకాండతో సంబంధమున్నజిప్రో హబికా లొంగుబాటు

మల్కన్‌గిరి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్‌లో అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల హత్యలో  కీలక పాత్ర పోషించాడని అనుమానిస్తున్న మావోయిస్టు జిప్రో హబికా (30) లొంగిపోయాడు. 2018 సెప్టెంబర్‌ 23న సర్వేశ్వరరావు, శివేరి సోమను నక్సల్స్‌ కాల్చి చంపారు. ఈ కేసుతోపాటు 2016 డిసెంబర్‌లో కోరాపుట్‌ జిల్లా  పొట్టంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాయిబ్‌ సర్పంచ్‌ సుందర్‌రావు కిడ్నాప్‌, హత్యతోపాటు వాహనాల దగ్ధం కేసులోనూ హబికా నిందితుడని తెలుస్తున్నది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్‌ డీ ఖిల్లారి సమక్షంలో బుధవారం హబికా లొంగిపోయాడు. హబికా ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా నారాయణపేట ప్రాంత వాసి. 2012లో మావోయిస్టు పార్టీలో చేరాడు. ఆ పార్టీ హింసాత్మక విధానాలతో విసుగెత్తి జన జీవన స్రవంతిలో కలువాలని నిర్ణయించుకున్నాడని ఎస్పీ చెప్పారు. అతడు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాడని, అతడిపై ఒడిశా ప్రభుత్వం రూ.4 లక్షల నగదు రివార్డును ప్రకటించిందని చెప్పారు. అతడికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. 

logo