శనివారం 28 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 16:51:02

మనుస్మృతి చెలామణిలో లేనప్పుడు దానిపై చర్చ అనవసరం: కమల్ హాసన్

మనుస్మృతి చెలామణిలో లేనప్పుడు దానిపై చర్చ అనవసరం: కమల్ హాసన్

చెన్నై : ‘మనుస్మృతి’ చెలామణిలో లేనప్పుడు దానిపై  చర్చించడంలో అర్థం లేదని మక్కల్‌ నీధి మైయం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ అన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. నిజాలు చెప్పడం నా రాజకీయ వ్యూహమని కమల్‌ హాసన్‌ నొక్కిచెప్పారు. 

మనుస్మృతి అనేది సమాజానికి ప్రవర్తనా నియమావళిని చూపించే పురాతన గ్రంథం. ఇది కుల వ్యవస్థ యొక్క ప్రతిపాదకుడని తరచుగా విమర్శలకు గురైంది. లోక్‌సభ ఎంపీ, విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) వ్యవస్థాపకుడు థోల్ తిరుమవాల్వన్ వీడియో క్లిప్ వైరల్ కావడంతో తమిళనాడులో మనుస్మృతి వాగ్వాదం చెలరేగింది. తిరుమవళవన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా, హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై గురువారం రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. మనుస్మృతి ప్రస్తుతం చెలామణిలో లేనందున దాని గురించి చర్చించడంతో ఎలాంటి ఔచిత్యం లేదన్నారు. ఇప్పుడా చర్చ అసంబద్ధమైనదని చెప్పారు. తమిళనాడులో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి ఉన్నదని కమల్ హాసన్ తెలిపారు. " తమ ఎంఎన్‌ఎం పార్టీ తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీ. ఇప్పుడే కూటమిపై వ్యాఖ్యానించలేను. పార్టీ నిర్మాణం బలోపేతం చేయడంపై దృష్టి ఉన్నది” అని అన్నారు. "నిజం నా రాజకీయ వ్యూహంగా ఉంటుంది. తమిళనాడులో స్థాపించబడిన పార్టీలు నిజం తమ రాజకీయ వ్యూహమని చెబుతాయా? మాది మార్గనిర్దేశం చేసే పార్టీగా అవతరిస్తుంది” అని కమల్ హాసన్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను చేయబోయే మొదటి పని లోక్‌పాల్ చట్టం తీసుకురావడమని తెలిపారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ డీఎంకేతో కూటమి చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను కమల్ హాసన్ కొట్టిపారేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.