శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 02:14:33

త్రిసూత్ర పథకం

త్రిసూత్ర పథకం
  • ప్రధాని మోదీకి సూచిస్తూ మన్మోహన్‌ వ్యాసం

న్యూఢిల్లీ, మార్చి 6: సామాజిక వైషమ్యాలు, ఆర్థిక మందగమనం, కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నుంచి భారత్‌కు ముప్పేట ముప్పు పొంచి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలకు పరిమితం కాకుండా సరైన విధాన నిర్ణయాలతో భారత్‌ను ఈ ముప్పు నుంచి కాపాడాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ఆంగ్ల దినపత్రికకు వ్యాసం రాశారు. సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోదీకి త్రిసూత్ర పథకం సూచించారు. మొదట దేశీయంగా అందుబాటులో ఉన్న వనరులు, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కొవిడ్‌-19 నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సామాజిక సామరస్య వాతావరణానికి ముప్పుగా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేయడం గానీ, నిబంధనలను సవరించడంగానీ చేయాలని, తద్వారా జాతి ఐక్యతకు మార్గం సుగమం చేయాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ద్రవ్య ఉద్దీపన పథకాలను తేవాలన్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన మత ఘర్షణలను నివారించి ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. 


logo