సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 16:26:55

కరోనాపై ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకోండి..

కరోనాపై ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకోండి..

న్యూఢిల్లీ: కరోనా పరీక్షలకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మంగళవారం జారీ చేసిన ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు దీనిపై లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. కరోనాపై పోరాటంలో అమిత్‌ షా నమూనా వర్సెస్‌ కేజ్రీవాల్‌ నమూనా అన్నది ప్రధానం కాదన్నారు. కరోనా రోగులను మరింతగా అసౌకర్యానికి గురిచేయకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సిసోడియా చెప్పారు. కరోనా లక్షణాలున్నవారు విధిగా క్వారంటైన్‌ కేంద్రం వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలన్న ఎల్జీ ఆదేశాన్ని ఆయన  తప్పుపట్టారు. కరోనా పరీక్ష కోసం క్వారంటైన్‌ కేంద్రం వద్ద క్యూ కట్టాల్సిన పని ఏమున్నదని ప్రశ్నించారు. భారీ వరుసల్లో నిల్చోవాలంటూ వారికి శిక్ష విధించలేమని  సిసోడియా స్పష్టం చేశారు. 

కాగా, హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి పల్స్‌ ఆక్సీమీటర్లను ఇస్తామని సీఎం కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. దీంతో కరోనా సోకిన వారు ఎప్పటికప్పుడు తమ ఆక్సిజన్‌ స్థాయిలను దీని ద్వారా పరీక్షించుకోవచ్చని, మరింతగా దిగజారితే సంబంధిత టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ మీటర్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విధానం వల్ల దవాఖానలపై ఒత్తిడి తగ్గడంతోపాటు అత్యవసర కరోనా రోగులకు సత్వర చికిత్స అందుతుందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. logo