శనివారం 23 జనవరి 2021
National - Dec 20, 2020 , 19:58:24

గ్యాలంట్రీ అవార్డును వాపస్‌ ఇచ్చిన పోలీసు అధికారి

గ్యాలంట్రీ అవార్డును వాపస్‌ ఇచ్చిన పోలీసు అధికారి

న్యూఢిల్లీ : మణిపూర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ (ఏఎస్‌పీ) తౌనాజమ్ బృందా తనకిచ్చిన గ్యాలంట్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగిచ్చేసింది. ఇంఫాల్‌లోని ప్రత్యేక కోర్టు ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించడంతో.. ఆమె తన అవార్డును వాపస్‌ చేసింది. 2018 పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్న కేసులో మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ముఖ్యమంత్రి పోలీసు పతకాన్ని ప్రదానం చేశారు. సరిహద్దు రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా దేశభక్తుల దినోత్సవం సందర్భంగా 2018 లో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్.. పోలీసు అధికారి తౌనాజోమ్ బృందాకు గ్యాలంట్రీ అవార్డును బహూకరించారు. అనంతరం ఆమెకు అదనపు సూపరింటెండెంట్ పదవికి పదోన్నతి లభించింది. 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ నాయకుడు, చందేల్ ఏడీసీ చైర్మన్ లుఖోసే జూ సహా మరో ఆరుగురిని నిర్దోషులుగా ఇంఫాల్‌లోని స్పెషల్ కోర్ట్ (ఎన్‌డీ అండ్ పీఎస్) ప్రకటించిన తరువాత తౌనాజమ్ బృందా పతకాన్ని తిరిగి ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌కు లేఖ రాసి.. గ్యాలంట్రీ అవార్డును వాపస్‌ ఇవ్వడానికి కోర్టు పరిశీలనే కారణమని, డ్రగ్స్‌ దర్యాప్తు ఎంతమాత్రమూ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నది. నా విధిని సక్రమంగా నిర్వహించలేదని నైతికతో అవార్డును వెనక్కి ఇచ్చేయాలని  నిర్ణయించుకున్నాను. అందువల్ల, మీ ద్వారా నాకు లభించిన గౌరవానికి నేను అర్హుడిని కాదని భావిస్తున్నాను. మరింత అర్హతగల, నమ్మకమైన పోలీసు అధికారికి ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర హోం శాఖకు గ్యాలంట్రీ అవార్డును తిరిగి ఇస్తున్నాను” అని ఆమె ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo