గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 09:49:13

మా ప్ర‌భుత్వానికి ఢోకా లేదు: మ‌ణిపూర్ సీఎం

మా ప్ర‌భుత్వానికి ఢోకా లేదు: మ‌ణిపూర్ సీఎం

ఇంఫాల్‌: మ‌ణిపూర్ త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరేన్ సింగ్ స్ప‌ష్టంచేశారు. త‌మ‌కు కొంత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని, అసెంబ్లీలో  అవిశ్వాస ప‌రీక్ష‌ జ‌రిగినా తాము బ‌లం నిరూపించుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. తాము రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని,  తాము చేసిన అభివృద్ధి ప‌నులు చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. 

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌జ్మాహెప్తుల్లా అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టుకు ఆదేశిస్తే ఎవ‌రి బ‌లం ఎంతో తేలిపోతుంద‌ని మ‌ణిపూర్ సీఎం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారుకు ఇటీవ‌ల నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మ‌ద్దతు ఉప‌సంహ‌రించుకోవ‌డంతోపాటు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేర‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. దీంతో మొత్తం 9 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటుప‌డింది. 

మ‌ణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మందికిగాను 9 మంది అన‌ర్హులు పోను ప్ర‌స్తుతం 51 మంది స‌భ్యులున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 26 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లం ఉండాలి. అయితే స‌భ‌లో బీజేపీ సొంతంగా 18 మంది, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిపి 23 మంది స‌భ్యుల బ‌లం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 20 మంది మిత్ర ప‌క్షాల‌తో క‌లిపి 28 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉన్న‌ది. 

పార్టీల బ‌లాబ‌లాల‌ లెక్క ప్ర‌కారం చూస్తే ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ‌కు కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని, త‌మ ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని బీజేపీ ధీమా వ్య‌క్తం చేస్తున్న‌ది. మ‌రోవైపు రాష్ట్రంలో ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డింద‌ని, అందుచేత త‌మ‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌ణిపూర్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి విజ్ఞప్తి చేశారు.    


  


logo