సోమవారం 25 జనవరి 2021
National - Dec 24, 2020 , 17:29:14

స్మార్ట్‌ఫోన్‌ పొందే వరకు పెండ్లి చేసుకోనన్న వ్యక్తికి కంపెనీ గిఫ్ట్‌

స్మార్ట్‌ఫోన్‌ పొందే వరకు పెండ్లి చేసుకోనన్న వ్యక్తికి కంపెనీ గిఫ్ట్‌

లక్నో: స్మార్ట్‌ఫోన్‌ పొందే వరకు పెండ్లి చేసుకోనన్న వ్యక్తికి ఆ కంపెనీ దానిని గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో అతడు సంబరపడిపోయాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమల్ అహ్మద్‌ అనే యువకుడు ఈ నెల 11న ట్విట్టర్‌లో సరదాగా ఒక ట్వీట్‌ చేశాడు. షియోమి కంపెనీ ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ‘ఎంఐ10టీప్రో’ స్మార్ట్‌ఫోన్‌ పొందే వరకు మ్యారేజ్‌ చేసుకోనని అందులో పేర్కొన్నాడు.

ఈ ట్వీట్‌కు పియోమి ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను కుమార్‌ జైన్‌ స్పందించారు. కమల్‌కు ఆ మొబైల్‌ ఫోన్‌ను గిఫ్ట్‌గా పంపారు. ఇక నువ్వు పెండ్లికి సిద్ధంగా ఉన్నట్లుగా భావిస్తున్నా అంటూ రీ ట్వీట్‌ చేశారు. ‘ఎంఐ10టీప్రో’ను ఇప్పుడు భారత్‌లో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. ఇది నీకు నచ్చుతుందని ఆశిస్తున్నానని, 108ఎంపీ కెమెరాను ట్రై చేసి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని కోరారు. 

కాగా తాను కోరుతున్న ‘ఎంఐ10టీప్రో’ను పియోమి ఇండియా నుంచి గిఫ్ట్‌గా పొందిన విషయాన్ని కమల్‌ అహ్మద్‌ ఈ నెల 21న ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఆ ఫోన్‌పై తెగ ప్రశంసలు గుప్పించడంతోపాటు మను కుమార్‌ జైన్‌, పియోమి ఇండియాకు ధన్యవాదాలు తెలిపాడు.

అయితే ఆ మరునాడు కమల్‌ అహ్మద్‌ మరోసారి ఫన్నీగా ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు తాను ‘ఎంఐ10టీప్రో’ను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ‘ఎంఐనోట్‌బుక్‌14’ తప్ప పియోమి, మను కుమార్‌ జైన్‌ను వరకట్నంగా ఏమీ కోరబోనంటూ ట్వీట్‌ చేశాడు. 


కాగా పలువురు నెటిజన్లు దీనిపై ఫన్నీగా స్పందించారు. తాము కూడా కోరింది పొందే వరకు పెండ్లి చేసుకోబోమంటూ తమకు ఇష్టమైన వాటితోపాటు కమల్‌ అహ్మద్‌ ట్వీట్లను జత చేసి పోస్ట్‌ చేస్తున్నారు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo