బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 19, 2020 , 10:21:55

త‌ల్లిదండ్రుల‌ను చంపిన‌ కొడుకు.. భ‌యంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

త‌ల్లిదండ్రుల‌ను చంపిన‌ కొడుకు.. భ‌యంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

కోల్‌క‌తా: ఉన్న‌త చ‌దువులు చ‌దివాడు. అయినా ఉద్యోగం లేదు. పైగా వ‌యోభారంతో బాధ‌ప‌డుతున్న‌ త‌ల్లి‌దండ్రులు. వీటికి తోడు క‌రోనా క‌ష్టాలు. దీంతో ఒత్తికి లోనైన‌ అత‌ను త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులను చంపేశాడు. పోలీసుల‌కు దొరికిపోతాన‌నే భ‌యంతో తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న ప‌శ్చిమ‌బెంగాల్‌లో చోటుచేసుకున్న‌ది. 

కోల్‌క‌తాకు 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హౌరా జిల్లా శిబ్‌పూర్‌లోని ఓ అపార్టుమెంటులో సుభోజిత్ బోస్ (40) త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్నాడు. ఎంసీఏ చేసిన‌ప్ప‌టికీ ఉద్యోగంలేక ఖాళీగా ఉన్నాడు. తండ్రి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ప‌నిచేసి రిటేర‌య్యారు. త‌ల్లిదండ్రులు వృద్ధులు కావ‌డంతోపాటు, ఎలాంటి ఉద్యోగం లేక‌పోవ‌డంతో పూట గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారింది. దీనికి క‌రోనా తోడ‌వ‌డంతో క‌ష్టాలు మ‌రింత పెరిగాయి. సంపాదన‌ లేక‌పోవ‌డంతో వారి పోష‌ణ భారంగా మారింది. దీంతో క‌ష్టాలు భ‌రించ‌లేక‌ త‌ల్లిదండ్రుల‌ను చంపేశాడు. రెండు రోజులుగా ఆ ఇంట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరిన పోలీసులు త‌లుపులు తెరిచి చూడ‌గా, వృద్ధుల మృత‌దేహాల ప‌క్క‌న బోస్ కూడా స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. దీంతో బోస్‌ను చికిత్స కోసం దవాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డు బాగానే ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. అదేవిధంగా మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం పంపించామ‌ని చెప్పారు.  

బోస్ త‌న త‌ల్లిదండ్రుల‌ను నాలుగు రోజుల క్రిత‌మే చంపాడ‌ని, ఒత్తిడికి లోనైన అత‌డు పోలీసులు అరెస్టు చేస్తార‌నే భ‌యంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.