శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 07:30:53

మొబైల్ డాటా వాడినందుకు త‌మ్ముడిని చంపిన అన్న‌

మొబైల్ డాటా వాడినందుకు త‌మ్ముడిని చంపిన అన్న‌

జైపూర్‌: మొబైల్‌ఫోన్, ఇంట‌ర్‌నెట్ ఇప్పుడు నిత్యావ‌స‌రాలుగా మారిపోయాయి. మొబైల్‌ఫోనే లోకంగా గడిపే నేటి యువ‌త అందులో డాటా లేక‌పోతే ఏదో కోల్పోయిన‌ట్లు భావిస్తున్నారు. డాటా కోసం త‌ల్లిదండ్రుల‌తో, స్నేహితులు, సోద‌రుల‌తో గొడ‌వ‌ల‌కు దిగుతున్న సంఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘ‌ట‌నే రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లోనూ జ‌రిగింది. అయితే ఇక్క‌డ త‌న మొబైల్‌ డాటాను అయిపోగొట్టినందుకు గొడ‌వ కాదు ఏకంగా త‌మ్ముడినే చంపాడో ప్ర‌బుద్ధుడు.   

జోధ్‌పూర్‌కు చెందిన రామ‌న్‌, రాయ్ అన్నాద‌మ్ములు. గ‌త బుధ‌వారం త‌మ్ముడు రాయ్ (23)‌, అన్న రామ‌న్‌కు తెలియ‌కుండా ఆయ‌న మొబైల్ డాటాను పూర్తిగా వాడుకున్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన రామ‌న్ త‌మ్ముడితో గొడ‌వ‌కు దిగాడు. అది చిలికిచిలికి గాలివాన‌లా మారింది. రాయ్‌ను బిల్డింగ్‌పైకి తీసుకెళ్లిన రామ‌న్‌, క‌త్తితో అత‌ని ఛాతీలో నాలుగైదుసార్లు బ‌లంగా పొడిచాడు. దీంతో అత‌డు ర‌క్తం క‌క్కుకోవ‌డంతో రామ‌న్ అక్క‌డి నుంచి పారిపోయాడు. కొద్దిసేప‌టి త‌ర్వాత ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిఉన్న రాయ్‌ను వారి కుటుంబ స‌భ్యులు ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. అయితే అత‌డు అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. విష‌యం ద‌వాఖాన నుంచి పోలీసు స్టేష‌న్‌కు వెళ్లింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు పారిపోయిన రామ‌న్ కోసం గాలిస్తున్నారు. అయితే అత‌డు అప్పుడ‌ప్పుడు మ‌తిస్థిమితం లేనివాడిలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింద‌ని పోలీసులు వెల్ల‌డించారు.