ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 19:03:37

అమిత్ షా సెక్ర‌ట‌రీగా ఫోన్ కాల్‌.. వ్య‌క్తి అరెస్టు

అమిత్ షా సెక్ర‌ట‌రీగా ఫోన్ కాల్‌.. వ్య‌క్తి అరెస్టు

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా పేర్కొంటూ ఫోన్ కాల్ చేసిన‌ ఓ వ్య‌క్తిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రాజ‌స్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గ‌ల తెహ్ ముండావ‌ర్ నివాసి. క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హర్యానా, రాజస్థాన్ కార్మికశాఖ‌ మంత్రులకు ఫోన్ చేసి ఒక‌రికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా సూచించాడు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసి నిందితుడు సందీప్ చౌదరిని అరెస్టు చేసింది. 

సందీప్ చౌదరి ధారుహేరాలో హీరో కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్‌-19 సంక్షోభం కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడు. రాజ‌స్థాన్ కార్మిక‌శాఖ మంత్రి తికారాంకు అదేవిధంగా హ‌ర్యానా కార్మిక‌శాఖ మంత్రి అనూప్ ధ‌న‌క్‌ల‌కు ఫోన్ చేసి ఇరు ప్రాంతాల్లో ఎక్క‌డైనా తాను సూచించిన వ్య‌క్తికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా చెప్పాడు. ఎంటీఎన్ఎల్ నుంచి త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరుతో సిమ్ తీసుకుని మంత్రుల‌కు కాల్ చేశాడు. హోంశాఖ ఫిర్యాదు మేర‌కు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుడిని రాజ‌స్థాన్‌లోని అల్వాన్‌లో అరెస్టు చేశారు.


logo