మంగళవారం 19 జనవరి 2021
National - Dec 23, 2020 , 18:10:37

డ్యాన్స్‌ చేయవా? అయితే విడాకులు ఇచ్చేస్తా!

డ్యాన్స్‌ చేయవా? అయితే విడాకులు ఇచ్చేస్తా!

మీరట్: పుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు పెద్దలు.. ఒక్కొక్కరు ఒక్కోరకమైన ఆహార్యంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. అయితే, దానిని  ఇతరులపై రుద్దనంతవరకు సంతోషంగా ఉంటుంది. లేదంటే జీవితాలే తారుమారవుతాయి. ఇలాంటి సంఘటన ఒకటి మీరట్‌ జిల్లాలో జరిగింది. తనతో డ్యాన్స్‌ చేయడానికి నిరాకరించడం, తాను కోరుకున్నట్లుగా జీన్స్ ధరించడానికి భార్య ఇష్టపడకపోవడంతో ఆగ్రహించిన భర్త.. భార్యకు విడాకులు ఇచ్చేశాడు. నిలబడ్డ చోటనే మూడు సార్లు తలాక్‌ చెప్పేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం ప్రస్తుతం చట్టరీత్యా నేరం  అని తెలియని ఆ పెద్దమనిషి.. భార్యకు విడాకులను ప్రకటించాడు. అంతటితో ఊరుకోకుండా ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మీరట్‌ నగరంలోని లిసారీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఇస్మాయిల్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్నది.

న్యూ ఇస్మాయిల్ నగర్ నివాసి అయిన అమిరుద్దీన్ తన కుమార్తెను ఎనిమిదేండ్ల క్రితం హపూర్‌లోని పిల్ఖువా నివాసి అనాస్‌తో వివాహమైంది. ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. అయితే, తన మాదిరిగా సోషల్‌గా ఉండాలని తరచూ భార్యను వేధించేవాడు. డ్యాన్స్‌ చేయాలంటూ, జీన్స్‌ ధరించాలంటూ భార్యను బలవంతం చేయడంతో ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. మతపెద్దలతో పంచాయతీ పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. 

చివరకు రెండు రోజుల క్రితం అనాస్‌ తన భార్య తాను చెప్పినట్లు నడుచుకోవడం లేదన్ని కోపంతో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. అనంతరం అత్తగారింటింకి వచ్చి వారితో వాగ్వాదానికి దిగాడు. అక్కడ తన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై గుర్తుతెలియని ద్రావణం పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో నివారించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. భార్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు లిసారీగేట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.