గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 09:47:33

కూలర్‌ కోసం వెంటిలేటర్‌ ప్లగ్‌ తీశారు.. కరోనా రోగి మృతి

కూలర్‌ కోసం వెంటిలేటర్‌ ప్లగ్‌ తీశారు.. కరోనా రోగి మృతి

కోటా: ఐసోలేషన్‌ వార్డులో ఉక్కబోతగా ఉన్నదని వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసి ఎయిర్‌ కూలర్‌ పెట్టడంతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. ఈ నెల 13న కరోనా లక్షణాలతో 40 ఏండ్ల వయస్సున్న ఓ వ్యక్తి కోటా ప్రభుత్వ దవాఖానలో చేరాడు. పరీక్షలు నిర్వహించడంతో అతనికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో జూన్‌ 15న అతన్ని ఐసోలేషన్‌ వార్డుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కాగా, ఐసోలేషన్‌ వార్డులో ఉక్కబోతగా ఉండటంతో అతని కుటుంబ సభ్యులు ఒక కూలర్‌ తీసుకువచ్చారు. అయితే అక్కడ కూలర్‌ పెట్టడానికి ప్లగ్‌ కనిపించకపోవడంతో వెంటిలేటర్‌ ప్లగ్‌ను తీసివేశారు. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి అరగంట తర్వాత ఊపిరాడక మరణించాడు. విషయాన్ని గమనించిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అదించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించాడని చెప్పారు. కాగా, ఐసోలేషన్‌ వార్డులో కూలర్‌ ప్లగ్‌ పెట్టుకోవడానికి తమ అనుమతి తీసుకోలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఐసోలేషన్‌ వార్డులో మరో వ్యక్తి కూడా చికిత్స పొందుతున్నాడు. 

ఈ వ్యహారంపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.నీవీన్‌ సక్సేనా ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. ఐసోలేషన్‌ వార్డులోని వైద్య సిబ్బంది కరోనా బాధితుడి మరణానికి సంబంధించిన సమాచారాన్ని కమిటీకి అందివ్వగా, అతని కుటుంబ సభ్యులు మాత్రం కమిటీ విచారణకు నిరాకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నివేదికను కమిటీ ఈరోజు అందివ్వనుంది.  


logo