శనివారం 30 మే 2020
National - Mar 31, 2020 , 13:11:49

ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌.. రూ.1.03 లక్షలు స్వాహా

ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌.. రూ.1.03 లక్షలు స్వాహా

ముంబయి : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో మద్యం దుకాణాలను బంద్‌ చేశారు. దీంతో మద్యం లేక మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి రూ. 1.03 లక్షలు పొగొట్టుకున్నాడు. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ చేసే వారి కోసం 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మార్చి 24న గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. ఓ నెంబర్‌ దొరకడంతో.. మద్యం కావాలని ఫోన్‌ చేశాడు. తప్పకుండా మద్యం హోమ్‌ డెలివరీ చేస్తామని చెప్పడంతో.. ఖాతా వివరాలు తెలియజేశాడు సదరు వ్యక్తి. ఓటీపీ చెప్పాలని కోరడంతో.. ఆ నంబర్‌ కూడా చెప్పేశాడు.

మొదట రూ. 3 వేలు డెబిట్‌ అయినట్లు మేసేజ్‌ వచ్చింది. ఒక మద్యం బాటిల్‌కు రూ. 3 వేలు ఏంటని అతను ప్రశ్నించగా.. మీ డబ్బు మీకు రిఫండ్‌ అవుతుంది సార్‌ అని బదులిచ్చాడు. డబ్బు రిఫండ్‌ చేస్తున్నామని ఓటీపీ మరోసారి చెప్పాలని అవతలి వ్యక్తి అడిగాడు. ఇలా మూడు రోజుల్లో ఆరుసార్లు ఓటీపీ నంబర్‌ చెప్పడంతో.. మొత్తం రూ. 1.03 లక్షలు స్వాహా అయ్యాయి. మద్యం హోమ్‌ డెలివరీ కాలేదు. దీంతో మార్చి 27న తిలక్‌నగర్‌ పోలీసులకు బాధితుడి భార్య ఫిర్యాదు చేసింది. సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo