శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 13:47:47

ఖ‌డ్గంతో కేక్ క‌టింగ్.. యువ‌కుడు అరెస్ట్‌

ఖ‌డ్గంతో కేక్ క‌టింగ్.. యువ‌కుడు అరెస్ట్‌

నాగ్‌పూర్‌: ఎవ‌రైనా పుట్టిన‌రోజు నాడు కేక్ క‌ట్ చేస్తే ఇంట్లో కూర‌గాయ‌లు కోసే క‌త్తినో, లేదంటే కేక్‌ల‌‌తోపాటు బేక‌రీల్లో ల‌భించే ప్లాస్టిక్ క‌త్తితోనో క‌ట్ చేస్తారు. కానీ, మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌కు చెందిన నిఖిల్ ప‌టేల్ (19) అనే యువ‌కుడు అంద‌రికంటే భిన్నంగా ఉండాల‌నుకున్నాడో ఏమో.. ఏకంగా ఓ ఖ‌డ్గంతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్‌చేశాడు. దాంతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి క‌ట‌క‌టాల వెన‌క్కు పంపారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నిఖిల్ ప‌టేల్ అక్టోబ‌ర్ 21న త‌న స్నేహితుల‌తో క‌లిసి పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకున్నాడు. 

ఈ సంద‌ర్భంగా నిఖిల్ స్నేహితులు భారీ సైజులో ఉన్న నాలుగు కేకులు తెప్పించారు. అయితే, నిఖిల్ వాటిని చాకుతో కాకుండా ఓ భారీ ఖ‌డ్గంతో క‌ట్‌చేశాడు. ఆ దృశ్యాల‌ను నిఖిల్‌, అత‌ని స్నేహితులు క‌లిసి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అంతేగాక వాటిని వాట్సాప్ స‌హా వివిధ సోష‌ల్‌మీడియా యాప్‌ల‌లో పోస్ట్‌చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు నిఖిల్‌పై కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ ఇంటి నుంచి ఖ‌డ్గాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.