సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 10:19:51

గాయపడిన భార్యను 12 కి.మీ. సైకిల్‌పై తీసుకెళ్లాడు..

గాయపడిన భార్యను 12 కి.మీ. సైకిల్‌పై తీసుకెళ్లాడు..

హైదరాబాద్‌ : చికిత్స కోసం ఓ వ్యక్తి తన భార్యను 12 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై తీసుకెళ్లాడు. అంబులెన్స్‌ను సహాయం కోరితే వారు ఎక్కువ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశారు. చేసేదేమీ లేక తన భార్యను బ్రతికించుకోవడానికి.. ఆమెను సైకిల్‌పై తీసుకెళ్లాడు. ఈ సంఘటన పంజాబ్‌లోని లుధియానాలో చోటు చేసుకుంది.

భరత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో పని చేస్తుంది. మార్చి 20వ తేదీన ఫ్యాక్టరీలోనే ఆమె గాయపడింది. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది ఆమెను భరత్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు ఎక్స్‌రే తీయగా.. ఊపిరితిత్తుల్లో నీరు భారీగా చేరినట్లు తేలింది. మెరుగైన చికిత్స కోసం కంగన్‌వాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కంగన్‌వాల్‌ వెళ్లేందుకు బాధితురాలి భర్త అంబులెన్స్‌లను సహాయం కోరగా వారు.. రూ. 2 వేలు డిమాండ్‌ చేశారు. ఆయన వద్ద అంత డబ్బు లేకపోవడంతో.. తన సైకిల్‌పైనే 12 కిలోమీటర్లు భార్యను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 694కు చేరింది. నిన్న ఒక్కరోజే 88 కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న 44 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు.


logo