బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 11:20:31

బహిరంగంగా తుమ్మినందుకు చితకబాదాడు.. ఎందుకంటే?

బహిరంగంగా తుమ్మినందుకు చితకబాదాడు.. ఎందుకంటే?

ముంబయి : కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు కూడా జనాలు సాహసం చేయడం లేదు. ఒక వేళ వెళ్లినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ యువకుడు తన బైక్‌పై వెళ్తూ బహిరంగ ప్రదేశంలో తుమ్మాడు. కరోనా భయం వెంటాడుతున్న సమయంలో బహిరంగంగా ఎందుకు తుమ్మావ్‌? అని ప్రశ్నిస్తూ అతడిని మరో వ్యక్తి చితకబాదాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. 

కొల్హాపూర్‌ పట్టణంలోని గుజరాయి ఏరియాలో ఓ యువకుడు తన బైక్‌పై వెళ్తున్నాడు. ప్రయాణిస్తూనే రోడ్డుపై తుమ్మాడు. దీంతో ఆ యువకుడిని మరో వ్యక్తి ఆపి.. బహిరంగ ప్రదేశంలో ఎందుకు తుమ్మావ్‌? అని ప్రశ్నించాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవా? చేతి రుమాలు అడ్డం పెట్టుకుని తుమ్మొచ్చు? కదా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులంతా గుమిగూడారు. ఇంతలోనే తుమ్మిన వ్యక్తిని మరో వ్యక్తి కొట్టాడు. 

అయితే ఈ ఘటన అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డు అయింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.  ఈ వీడియోపై పోలీసులు స్పందిస్తూ.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. ఉమ్మివేయడం, తుమ్మడం, దగ్గు ద్వారా ఈ వైరస్‌ సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.


logo
>>>>>>