సోమవారం 06 జూలై 2020
National - May 28, 2020 , 16:47:45

లాక్‌డౌన్‌లో ప్రయాణానికి దొంగ పాస్‌లు

లాక్‌డౌన్‌లో ప్రయాణానికి దొంగ పాస్‌లు

ముంబై: దేశంలో విజృంభిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌తో విస్తరించకుండా ప్రయత్నాలుచేస్తుంది. అయినా దేశంలో కరోనా కోరలు చాస్తూ రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు దేశంలో ఉన్న లాక్‌డౌన్‌ను కూడా క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు అక్రమార్కులు. లాక్‌డౌన్‌లో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం అక్రమార్కులు ఫేక్‌ ఈ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ముంబాయిలోని చెంబూర్‌కు చెందిన 28 ఏళ్ళ యువకుడిని దొంగ పాస్‌ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది ముఠా సహకారంతో ఫోర్జరీ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేస్తూ ఒక్కో పాస్‌కు దాదాపు రూ.5000 లకు పైగా అమ్మకం చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు.

ఈ క్రమంలో ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో దక్షిణ ముంబైలోని డోంగ్రీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సూత్రదారి మనోజ్‌ రాము హంబేను అరెస్టు చేశారు. నిందితులు దొంగ పాస్‌లను ముంబై, నేవీ ముంబై పోలీసు కమీషనర్లు, ముంబైకి చెందిన పలు కలెక్టర్‌లు జారీ చేసినట్లుగా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 420, 465ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


logo