ఆదివారం 24 జనవరి 2021
National - Oct 10, 2020 , 12:24:14

రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం చ‌నిపోయిన‌ట్లు నాట‌కం!

రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం చ‌నిపోయిన‌ట్లు నాట‌కం!

న్యూఢిల్లీ: హ‌‌ర్యానాలో ఓ వ్య‌క్తి ఉన్న‌ట్టుండి కోటిశ్వ‌రుడు అయిపోవాల‌ని క‌ల‌లుగ‌న్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌క్కా ప్లాన్ కూడా చేశాడు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఆ ప్లాన్‌ను అమ‌లు చేసే క్ర‌మంలో క‌థ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసికొట్ట‌డంతో పోలీసులు అత‌డిని అరెస్ట్‌చేసి క‌ట‌క‌టాల‌ వెన‌క్కి పంపించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే హ‌ర్యానాకు చెందిన ఓ వ్య‌క్తి సులువుగా డ‌బ్బు సంపాదించి ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విద్దాం అనుకున్నాడు. 

అందుకు త‌గ్గ‌ట్టుగానే ఒక ప‌క్కా ప్లాన్ చేశాడు. త‌న పేరు మీద రూ.2 కోట్ల‌కు ట‌ర్మ్ పాల‌సీ క‌ట్టి కొన్నాళ్లు ఓపిక ప‌ట్టాడు. ఆ త‌ర్వాత కుటుంబ‌స‌భ్యులతో క‌లిసి ప్లాన్ అమ‌లుకు ప్ర‌ణాళిక ర‌చించాడు. తాను కొన్నాళ్లు క‌నిపించ‌కుండా పోతాన‌ని, ఆ స‌మ‌యంలో తాను చ‌నిపోయిన‌ట్లు న‌మ్మించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల‌ని సూచించాడు. ఆ మేర‌కే అత‌ని కుటుంబం స‌ద‌రు వ్య‌క్తిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఫిర్యాదుదారుల‌ను క్రైమ్ సీన్ జ‌రిగిన‌ట్లుగా పేర్కొన్న ప్రాంతానికి తీసుకెళ్లి ప‌లు ర‌కాలుగా ప్ర‌శ్నించారు. అయితే వారు చెప్పిన స‌మాధానాలు పొంత‌న లేకుండా ఉండ‌టంతో అనుమానించిన పోలీసులు గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. దీంతో నిందితుడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఉన్న‌ట్లు గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చామ‌ని హ‌ర్యానా పోలీసులు తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo