సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 16:28:13

ప్యాంట్‌ పొట్టిగా కుట్టాడని పోలీసులను ఆశ్రయించాడు..

ప్యాంట్‌ పొట్టిగా కుట్టాడని పోలీసులను ఆశ్రయించాడు..

భోపాల్‌ : దర్జీ ప్యాంట్ ‘చాలా పొట్టిగా’ కుట్టాడని పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. దీంతో సమస్య పరిష్కారానికి కోర్టుకెళ్లాలని సదరు వ్యక్తి సూచించారు పోలీసులు. చదవడానికి కొంచం చిత్రంగా ఉన్నా మీరు చదివింది నిజమే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్‌లోని సిధీ జిల్లాకు చెందిన కృష్ణకుమార్‌ దూబే గత అక్టోబర్‌లో ఉద్యోగం కోసం భోపాల్‌ వచ్చాడు. రూ.9వేలకు సెక్యూరిటీ గార్డుగా పని చేయగా, రెండు నెలల కిందట కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయాడు.

ఇటీవల ఒక స్నేహితుడి వద్ద నుంచి రూ.1000 అప్పు తీసుకుని, రెండు మీటర్ల పొడవున్న బట్టతో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేశాడు. ప్యాంట్‌ కుట్టేందుకు దర్జీకి ఇచ్చి, రూ.190 చెల్లించాడు. అయితే కుట్టిన ప్యాంటు వేసుకున్నప్పుడు పొట్టిగా ఉండడంతో టైలర్‌ వద్దకు వెళ్లాడు. దీంతో అతను తీసుకువచ్చిన బట్ట సరిపోలేదని, చెప్పగా షాపు యజమాని వద్దకు వెళ్లాడు. అతడు రెండు మీటర్లు ఇచ్చినట్టు చెప్పాడు. దీంతో దూబే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా సూచించామని హబీబ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేష్ శ్రీవాత్సవ శనివారం తెలిపారు. అయితే ఎట్టకేలకు దూబేకు డబ్బులు తిరిగి ఇస్తానని దర్జీ చెప్పడంతో సమస్య పరిష్కారమైంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo