శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 16:36:47

గవర్నర్ రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలంటున్నారు : జగదీప్ ధంఖర్

గవర్నర్ రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలంటున్నారు : జగదీప్ ధంఖర్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనపై మరోసారి దాడి చేశారు. రాష్ట్ర అధికారాలను స్వాధీనం చేసుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. గవర్నర్‌ రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారని చెప్పారు. రాజ్యంగానికి లోబడి గవర్నర్‌ నడుచుకోవాలని మమతా బెనర్జీ ధంఖర్‌పై మాటల దాడిని ఆయన మీడియా సమావేశంలో తిప్పికొట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై ఆమె వైపు నుంచి సమాచారం కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవటంపై ధంఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"రాజ్‌భవన్‌లో గవర్నర్ రబ్బర్‌స్టాంప్‌గా ఉండాలని కోరుకుంటున్న మమతా బెనర్జీకి రాజ్యాంగం ఏమి చెప్తున్నదో గుర్తుచేయాలని అనుకుంటున్నాను. నేను వివిధ విషయాలకు సంబంధించి వ్రాతపూర్వకంగా సమాచారం అడిగాను. కాని, వారి వైపు నుంచి ఇంకా స్పందన రాలేదు" అని ధంఖర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై తాను ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కు లేఖ రాశానని, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నేరాలు, అక్రమ బాంబు తయారీ, అవినీతికి "సురక్షితమైన స్వర్గంగా" మారుతోందని ధంఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పోలీసు శాఖను ఉపయోగిస్తున్న విషయాన్ని ఆయన లేవనెత్తారు. "పశ్చిమ బెంగాల్ పోలీసు రాజ్యంగా మారింది. పోలీసు పాలన, ప్రజాస్వామ్యం సహజీవనం చేయలేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కూలిపోయాయి. మావోయిస్టుల తిరుగుబాటు తల పైకెత్తింది. ఉగ్రవాద మాడ్యూల్స్ కూడా రాష్ట్రంలో చురుకుగా ఉన్నాయి" అని గవర్నర్‌ చెప్పారు. 

2019 జూలై లో గవర్నర్ పదవికి జగదీప్‌ ధంఖర్‌ నియమితులైనప్పటి నుంచి ధంకర్-టీఎంపీ ప్రభుత్వం మధ్య ఘర్షణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీకి గవర్నర్‌ లేఖ రాయడాన్ని తప్పుపట్టిన ముఖ్యమంత్రి మమతా.. రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని సలహా ఇచ్చారు.


logo