శనివారం 04 జూలై 2020
National - Jun 26, 2020 , 17:26:10

బొగ్గు గనులపై నిర్ణయాన్ని సమీక్షించండి.. మోదీకి దీదీ లేఖ

బొగ్గు గనులపై నిర్ణయాన్ని సమీక్షించండి.. మోదీకి దీదీ లేఖ

కోల్‌కతా : బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. బొగ్గు రంగంలో మల్టీ నేషనల్‌ కంపెనీలకు 100 శాతం పెట్టుబడులకు అనుమతివ్వడమంటే తప్పుడు సంకేతాలు పంపించినట్లేనన్నారు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌ సారాంశాన్ని దెబ్బతీయడమేనన్నారు. దేశం స్వావలంభన సాధించాలన్న ఆశయాన్ని చంపేయడమేనన్నారు. కావునా దయచేసి ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా కోరుతున్నట్లు ఆమె ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ దిశగా బొగ్గు గనులశాఖ అడుగులు ముందుకు వేయకుండా చూడాల్సిందిగా కోరారు.

బొగ్గు లభ్యతో 80 శాతం దేశంలోని తూర్పు ప్రాంతంలో లభిస్తుంది. అందుకే కోల్‌కతాలో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఉంది. భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌(బీసీసీఎల్‌), సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌), సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎస్‌ఈసీఎల్‌), మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎంసీఎల్‌) ఈ నాలుగు అనుబంధ సంస్థల డెస్క్‌ కార్యాలయాలు కోల్‌కతా నుంచి మార్చాలని ఇటీవల తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేసిందన్నారు.

ఇలా తరలిస్తే వాటాదారుల ప్రయోజనాలకు హానికలగడంతో పాటు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ కరోనా సమయంలో ఎంతో బాధకు గురైతారన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వారి జీవనోపాధిని కోల్పోతారన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుదని ఆమె పేర్కొన్నారు. బొగ్గు రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తొలగిస్తూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే.


logo