మంగళవారం 02 మార్చి 2021
National - Jan 19, 2021 , 03:25:05

నందిగ్రామ్‌ నుంచే ఢీకొడతా!

నందిగ్రామ్‌ నుంచే ఢీకొడతా!

  • సువేందు అధికారికి మమత సవాల్‌
  • దీదీని ఓడిస్తా: బీజేపీ నేత ప్రతిసవాల్‌

నందిగ్రామ్‌, జనవరి 18: పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), విపక్ష బీజేపీ మధ్య పోరు తీవ్రమైంది. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ సోమవారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి సిట్టింగ్‌ స్థానమైన నందిగ్రామ్‌ (పుర్బో మేధినీపూర్‌) నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీపై మమత నిప్పులు చెరిగారు. ‘టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్తున్న నేతలంతా కొన్నేండ్లుగా పోగేసుకొన్న అక్రమ సంపాదనను కాపాడుకోవటానికే వెళ్తున్నారు. మా పార్టీలో ఉండి అవినీతికి పాల్పడిన నేతలను బీజేపీలోకి వస్తే కేసులు లేకుండా చేస్తామని కాషాయ పార్టీ ప్రలోభ పెడుతున్నది. వాషింగ్‌మెషిన్‌లో వేసి వాళ్ల మరకలను ఉతికేస్తారేమో.. వాషింగ్‌పౌడర్‌ బీజేపీ’ అంటూ ఎద్దేవా చేశారు. 

సవాల్‌కు సై

మమత సవాల్‌ను సువేందు అధికారి స్వీకరించారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే, టీఎంసీలాగా కాకుండా బీజేపీలో ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై అందరు నేతలతో చర్చించి నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. ‘నా పార్టీ నన్ను నందిగ్రామ్‌లో అభ్యర్థిగా నిలిపితే మమతాబెనర్జీని కనీసం 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా. లేదంటే రాజకీయాలను వదిలేస్తా’ అని తెలిపారు. 

VIDEOS

logo