శనివారం 23 జనవరి 2021
National - Dec 25, 2020 , 12:21:40

మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌కు షాక్‌

మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌కు షాక్‌

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) చీఫ్‌కు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత అరుణాచలం శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఎంఎన్‌ఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరుణాచలం చైన్నైలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలకు కమల్‌ హాసన్‌ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. తూటికోరిన్‌ జిల్లాకు ఓ మారుమూల గ్రామానికి చెందిన అరుణాచలం.. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో మక్కల్‌ నీది మయ్యం పార్టీకి పునాది వేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి  ఎంఎన్‌ఎంను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

అరుణాచలం నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, రాబోయే ఎన్నికల కోసం కమల్‌ ఈ నెల ప్రారంభంలో తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఎన్నికల్లో కజగం పార్టీలతో పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. సినీ నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారుతున్న రజనీకాంత్‌ త్వరలో ప్రారంభించనున్న పార్టీతో పెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్‌ ఇటీవల ఎన్నికల కోసం పాలన ప్రణాళికను విడుదల చేశారు. ‘గ్రీన్‌ చానల్‌ గవర్నమెంట్‌, ఆన్‌లైన్‌ హోమ్స్‌, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ అవకాశాలు అందించడం, మహిళల సుసంపన్నం’ తదితర పథకాలను ప్రకటించారు. 


logo