సోమవారం 18 జనవరి 2021
National - Dec 30, 2020 , 19:13:15

తేజ‌స్విని సీఎంను చేసి ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేయండి: నితీశ్‌కు ఆర్జేడీ సూచన

తేజ‌స్విని సీఎంను చేసి ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేయండి: నితీశ్‌కు ఆర్జేడీ సూచన

ప‌ట్నా: తేజ‌స్వియాద‌వ్‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టి, ప్ర‌ధాని ప‌ద‌విపై దృష్టి సారించాల‌ని ఆర్జేడీ సీనియ‌ర్ నాయ‌కుడు, బీహార్ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ ఉద‌య్ నారాయ‌ణ్ చౌధ‌రి సీఎం నితీశ్‌కుమార్‌కు స‌ల‌హా ఇచ్చారు. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మేల్యేల‌ను మిత్ర‌ప‌క్షం బీజేపీ చీల్చ‌డం, బీహార్ కేబినెట్ విస్త‌ర‌ణ విష‌యంలో నితీశ్‌పై బీజేపీ నేత‌లు అజామాయిషీ చేస్తుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్జేడీ నేత ఇలాంటి స‌ల‌హా ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

నితీశ్‌కుమార్ మ‌హా కూట‌మిలోకి వ‌చ్చి తేజ‌స్వియాద‌వ్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడితె.. ఆర్జేడీ నితీశ్‌కుమార్‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా నిల‌బెడుతుంద‌ని ఉద‌య్ నారాయ‌ణ్ చౌధ‌రి ప‌ర్కొన్నారు. ఆర్జేడీ ఒక‌సారి నితీశ్‌ను ముఖ్య‌మంత్రిని చేసింద‌ని, ఇప్పుడాయ‌న పెద్ద మ‌న‌సు చేసుకుని తేజ‌స్విని సీఎంను చేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం ఎన్డీఏ కూట‌మిలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌న్నారు. బీజేపీ ప‌క్కా ప్లాన్‌తో చిన్న‌పార్టీలను తొక్కేస్తున్న‌ద‌ని ఆరోపించారు. బీజేపీ తీరు చెరువులో చిన్న‌చేప‌ల‌ను మింగేసే పెద్ద చేప తీరుగా ఉన్న‌ద‌ని చౌధ‌రి విమ‌ర్శించారు. 

బీజేపీ కుట్ర‌ను ప‌సిగ‌ట్టే శివ‌సేన ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌టికి వచ్చింద‌ని నారాయ‌ణ్ చౌధ‌రి చెప్పారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో విభేదించి శిరోమ‌ణి అకాలీద‌ళ్ కూడా ఎన్డీఏకు గుడ్ బై చెప్పింద‌న్నారు. ఇప్ప‌డు జేడీయూ వంతు వ‌చ్చింద‌ని, బీజేపీ ఆడించిన‌ట్ట‌ల్లా ఆడే బ‌దులు నితీశ్‌కుమార్‌ కూట‌మి నుంచి బ‌య‌టికి వ‌చ్చి కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టిసారించ‌డం మంచిద‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. 

రాహుల్‌గాంధీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప‌నికిరాడ‌ని భావిస్తున్నారా..? అందుకే నితీశ్‌కుమార్ కూట‌మిలోకి వ‌స్తే ప్ర‌ధాని అభ్య‌ర్థిని చేస్తామ‌ని చెబుతున్నారా..? అని మీడియా ప్ర‌శ్నించ‌గా.. దేనికైనా టైమ్ రావాలి అని చౌధ‌రి అర్థం కాని స‌మాధానం చెప్పారు. కాగా, చౌధ‌రి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మండిప‌డింది. ఆర్జేడీ నేత‌లు బీజేపీ-జేడీయూ పొత్తుల‌పై మాట్లాడ‌టానికి ముందు కాంగ్రెస్‌తో వారి సంబంధాల‌ను మెరుప‌ర్చుకోవాల‌ని దెప్పిపొడిచారు. ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.